రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలు కోలాహల వాతావరణంలో సాగాయి. చిన్నాపెద్దా అంతా కలిసి సందడిగా గడిపారు.
రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో నూతన సంవత్సర సంబరాలు అంభరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా నగరవాసులంతా కొత్త ఏడాదికి శుభ స్వాగతం పలికారు. ఆటపాటలతో, ఉత్సాహపరిచే నృత్యాలతో 2019 సంవత్సరానికి ఘన వీడ్కోలు పలికి... 2020కి అదిరే ఆరంభం ఇచ్చారు. సరికొత్త దశాబ్దానికి ఉరిమే ఉత్సాహంతో స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు.
శ్రీకాకుళం విజేత హోటల్లో నూతన సంవత్సర వేడుకలను వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కొత్త ఏడాదిని పురస్కరించుకుని విజయవాడలోని ప్రముఖ హోటళ్లన్నీ సుందరంగా ముస్తాబు అయ్యాయి. నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో యువత సంబరాల్లో పాల్గొని సంగీత, నృత్యప్రదర్శనలను ఆస్వాదించారు. మరోవైపు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లేవారితో నగరంలోని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. నగర పోలీసులు పోలీస్స్టేషన్లలో కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
విశాఖ సాగర తీరంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాళీ మాత ఆలయం నుంచి యంఎంసీఏ వరకు రోడ్డంతా జనాలతో కిక్కిరిసి పోయింది. ఆర్కే బీచ్లో ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు వచ్చారు. బీచ్లో ఈలలు వేస్తూ.. కాల్చిన బాణసంచా చూపరులను ఆకట్టుకుంది.
గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా జరిగాయి. యువత కేరింతలు కొడుతూ ఆనందోత్సవాల మధ్య కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కళాశాల యువత నృత్య...గాన పదర్శనలతో ఉత్సహాన్ని ప్రదర్శించారు. యువకులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి వాహనాలపై తిరుగుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కళాశాల యువత నూతన సంవత్సరం సందర్భంగా తమ రాజధానిని మార్చకూడదని నినదించారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ తమ ఆంకాక్షను వెలిబుచ్చారు.
అనంతలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదట జిల్లా పోలీసులు డీఎస్పీ వీర రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పోలీసు బలగాలతో చర్యలు తీసుకున్నారు. నగరంలోని టవర్ క్లాక్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపారు.
ఇదీ చూడండి: అంధ్రా కశ్మీర్ చూడాలంటే...చలో లంబసింగి