NEW DISTRICTS ISSUE: కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలంటూ చాలాచోట్ల నిరసన గళం వినిపిస్తున్నారు. రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేస్తూ ఆందోళన తెలియజేస్తున్నారు. జిల్లా కేంద్రంగా మదనపల్లెను ప్రకటించాలంటూ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నేతలు రాస్తారోకో నిర్వహించారు. రామసముద్రంలో.. మదనపల్లె జిల్లా సాధన జేఏసీ అధ్యక్షుడు గౌతంకుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో...
రాజంపేటను జిల్లా కేంద్రం చేయలేదంటూ.. వైకాపాకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఉడుమువారిపల్లి గ్రామవాసులు ప్రకటించారు.. జిల్లాల విభజన వంచనకు నిరసనగా బరువెక్కిన హృదయాలతో.. వైకాపాకు సెలవంటూ గ్రామ పొలిమేరలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాజంపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ తెలుగుదేశం కార్యకర్తలు 10 కిలోమీటర్ల మేర ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన తెలుగుదేశం సీనియర్ నేత చెంగలరాయుడిని అడ్డుకుని, నిర్బంధించారు.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలంటూ రైల్వేకోడూరు ప్రజలు డిమాండ్ చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో...
హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ప్రకటించాలంటూ.. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత అబ్దుల్ గని పాల్గొన్నారు. ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన జగన్ ఇప్పుడు పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ప్రకటించడం బాధాకరమన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
ప్రభుత్వం ప్రకటించిన పాడేరు జిల్లాను వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో జిల్లా సాధన సమితి నేతలు సమావేశమయ్యారు. పాడేరును జిల్లా కేంద్రం చేస్తే.. రంపచోడవరం నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని వివరించారు. కోనసీమ జిల్లాకు.. అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కోనసీమ దళిత ఐక్యవేదిక నాయకులు దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ హాజరయ్యారు. ఈ డిమాండును సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
విశాఖ జిల్లాలో...
అరకులోయ కేంద్రంగానే కొత్త గిరిజన జిల్లా ప్రకటించాలంటూ రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అరకు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో.. స్థానిక గిరిజన ఉద్యోగుల భవన్‌లో అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక.. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెను ప్రజల కోపాన్ని దృష్టి మరలించేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
ఇదీ చదవండి: