అత్యంత నాణ్యమైన ప్రమాణాలను పాటిస్తూ, అందరి ప్రశంసలు పొందుతున్న తెలంగాణ హైదరాబాద్ నెహ్రు జంతు ప్రదర్శనశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. పారిశుద్ధ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, జూ ఆస్పత్రి, జంతురక్షణ, హైజీన్, ఎస్టాబ్లిషమెంట్లను తనిఖీ చేసిన నిపుణుల బృందం... వివిధ విభాగాల్లో పాటిస్తున్న ప్రమాణాలను పరిశీలించింది.
అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది స్పందించే విధానం గొప్పగా ఉందని నిపుణుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సమాచారం, గణాంకాల ఆధారంగా యూకే అక్రిడేషన్ కమిటీ ఐఎస్ఓ 9001 ధృవపత్రాన్ని మంజూరు చేసింది. హైదరాబాద్ అరణ్యభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధృవపత్రాన్ని అధికారులకు అందించారు. నాణ్యతా నిర్వహణ విభాగంలో గుర్తింపు దక్కడం హర్షణీయమని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ దేశంలోనే ఐఎస్ఓ గుర్తింపు పొందిన మొదటి జూగా నెహ్రూ జంతు ప్రదర్శనశాల నిలవడం గర్వకారణమని పీసీసీఎఫ్ శోభ తెలిపారు. కరోనా కష్టకాలంలో 24 గంటలు పని చేసిన సిబ్బంది నిబద్ధత, అమలు చేసిన శుభ్రతా చర్యలు చాలా ప్రశసంశనీయమని తెలిపారు.