ఏపీలో గంజాయి పరిశ్రమ నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని నిలదీస్తే తెదేపా కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. ఎవరూ లేని సమయంలో దాడులు చేయడం సరికాదన్న లోకేశ్... ఆ దాడులను పోలీసులే ప్రేరేపించే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీసులు లేకుండా వైకాపా నేతలు బయటకు రావాలన్న ఆయన.. కొన్ని పిల్లులు...పులులమని భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పసుపు జెండా చూస్తే ఎందుకంత భయమని ప్రశ్నించిన నారా లోకేశ్..ఒక చెంప మీద కొడితే...రెండు చెంపలను వాయగొడతామని హెచ్చరించారు. తమ ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమేనని.. తమ కార్యకర్తల గుండెలను గాయపరచలేరని స్పష్టం చేశారు.
రెండున్నరేళ్లు ఆగితే మళ్లీ చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్ రెడ్డిలా తాను చిన్నాన్న జోలికి వెళ్లలేదన్న లోకేశ్.. ఆ హత్య కేసును త్వరగా తేల్చాలన్నారు. 2024లో మంగళగిరిలో తెదేపాను గెలిపించి కానుకగా ఇస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. వైకాపాకు ట్రైలర్ మాత్రమే చూపామన్న లోకేశ్.. సినిమా ముందుందని పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంలో గంజాయి ముఠాను పట్టుకున్నా ఏపీ పేరే చెబుతున్నారని లోకేశ్ అన్నారు. దేశంలో ఏ మూల డ్రగ్స్ పట్టుకున్నా రాష్ట్రంతో లింకు ఉంటుందని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయితో ఏపీకి సంబంధం లేదని సీఎం, డీజీపీ చెబుతున్నారు కానీ దేశవ్యాప్తంగా పోలీసు, నిఘా వ్యవస్థలు డగ్స్ హబ్ ఏపీ అంటున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పోలీసు, నిఘా వ్యవస్థలను విచారణకు పిలుస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: