Nara Lokesh Reacts Tribal Student Issue: నిద్రావస్థలో ఉన్న జగన్ ప్రభుత్వం వల్లే గిరిజన విద్యార్థిని మృతి చెందిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ఆశ్రమపాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుమిత్ర నడిరోడ్డుపై కన్నతల్లి ఒడిలోనే మృతి చెందిందనే సమాచారం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. జగన్ మోసపు రెడ్డి మాటలు అందాల సుమిత్రని తిరిగి తీసుకురాగలవా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కపట ప్రకటనలు గిరిజన విద్యార్థినికి ప్రాణం పోయగలవా? అని మండిపడ్డారు. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చావడికోట పంచాయతీ చెక్కవాడ గ్రామానికి చెందిన అందాల సుమిత్రకి జ్వరం వస్తే కనీస వైద్యం చేయించకుండా ఇంటికి పంపించేసిన ఆశ్రమపాఠశాల సిబ్బందిని ఏమనాలని లోకేశ్ నిలదీశారు. బోదలూరు పీహెచ్సీ నుంచి మారేడుమిల్లి, అక్కడి నుంచి రంపచోడవరం, అక్కడి నుంచి రాజమండ్రి ఆ తరువాత కాకినాడ ప్రభుత్వ వైద్యశాలలకు తరలించి మెరుగైన వైద్యం చేయకుండా ఇంటికి పంపేసిన ప్రభుత్వ ఆస్పత్రులు తీరు ఘోరంగా ఉందని మండిపడ్డారు. మీరు నాడు- నేడులో పాఠశాలలో కల్పించిన సౌకర్యాలు, సదుపాయాలు ఏవని ప్రశ్నించారు. ఆశ్రమ పాఠశాలల్లో పిల్లల్ని మేనమామగా కాపాడటానికి పెట్టిన సిబ్బంది ఏమయ్యారని ధ్వజమెత్తారు. ఏ రోగానికైనా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అంటూ వైకాపా చేసిన ప్రకటనలు బోదలూరు పీహెచ్సీ నుంచి కాకినాడ జనరల్ ఆస్పత్రి వరకూ ఎక్కడా సుమిత్ర ప్రాణాలు నిలబెట్టేందుకు ఎందుకు సహాయపడలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ వచ్చేదెప్పుడు? - ఎంపీ కేశినేని