కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కౌలు రైతుల ఆత్మహత్యలపై మూడేళ్ల క్రితం చట్టం చేశారని.., ప్రభుత్వ జీవో ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సరైన భరోసా అందట్లేదని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న వెయ్యి మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం చేయనున్నట్లు నాదెండ్ల స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో రేపు (మంగళవారం) పవన్ కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టనున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మీడియాకు వివరించారు. ఉదయం తొమ్మిది గంటలకు పవన్ పుట్టపర్తి చేరుకొని కొత్తచెరువు మండలంలో కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. అనంతపురం జిల్లాలో 170 మంది, కర్నూలు జిల్లాలో 370 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల పిల్లల చదువుకోసం పవన్ రూ.5 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.
"కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ జీవో ప్రకారం రూ.7 లక్షలు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం మాత్రం రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు భరోసా అందట్లేదు. రాష్ట్రంలో వెయ్యి మంది కౌలురైతు కుటుంబాలను ఆదుకుంటాం. పవన్ పర్యటనతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. అనంతపురంలో 28 మంది కౌలురైతు కుటుంబాలకు ఆర్థికసాయం. కౌలురైతు కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందిస్తారు."- నాదెండ్ల మనోహర్, జనసేన నేత
ఇదీ చదవండి: 12న అనంతపురం జిల్లాకు పవన్ కల్యాణ్