ఓ యువకుడు మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తున్నాడు. అతడిని ఆపిన పోలీసులు.. జరిమానా కట్టాలంటూ.. అడిగారు. ఈ మాటలతో మత్తులో ఉన్న అతడు పోలీసుల పైకే లేచాడు. మా నాన్న ఎవరో తెలుసా అంటూ వాగ్వాదానికి దిగాడు. 'నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీ కుమారుడిని. నాకు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుసు. నేను ఎందుకు జరిమానా చెల్లించాలి.' అంటూ పోలీసులతో చెప్పాడు. అసలు వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి అనురాగ్ రెడ్డి మద్యం తాగి కారు నడుపుతున్నాడు. ఉడిపిలోని కల్సంకా జంక్షన్ వద్ద పోలీసులు అతడిని ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. 193 యూనిట్లు చూపించింది. పోలీసులు అతడికి రూ.3000 జరిమానా విధించారు. 300 రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించనని యువకుడు ట్రాఫిక్ పోలీసులతో చెప్పాడు. "మా డాడీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ, ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి నా తండ్రి స్నేహితుడు, నేను వారిని పిలుస్తాను'. అంటూ బెదిరింపులకు దిగాడు.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అనురాగ్ రెడ్డి కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీడ్ డ్రైవింగ్ కింద జరిమానా విధించారు. ఈ మేరకు ఉడిపి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చదవండి: ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం