పురపాలక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సోమవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు గెలుపు కోసం పరుగులు పెడుతున్నారు. ప్రతి ఓటరును కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలను ఎక్కు పెడుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. చీరాలలో వైకాపా నేత కరణం వెంకటేశ్‌బాబు ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు సైకిల్ గుర్తుకే ఓటేయ్యాలని ప్రజలను కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ సత్యవతి ఓటర్లను అభ్యర్థించారు.
విజయనగరం జిల్లా సాలూరులో తెలుగుదేశం ఇన్‌ఛార్జ్ శివరామకృష్ణ ఇంటింటికీ వెళ్లి ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ ఎన్నికల ప్రచారం ఎంపీ రామ్మోహననాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
రాయలసీమలో..
రాయలసీమ జిల్లాలోనూ పురపాలక ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రచారం చేశారు. అదోనిలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జగన్ అన్ని హామీలు నేరవేరుస్తున్నారని.. కడప జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: విశాఖలో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థిపై దుండగుల దాడి