విజయవాడ కనకదుర్గ గుడి అవినీతి వ్యవహారం నగరపాలక సంస్థ ఎన్నికల్లో రాజకీయ వేడిని రాజేసింది. అవినీతిలో అసలు దొంగలు మంత్రి వెల్లంపల్లి, ఈవో సురేష్ బాబులేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి, ఈవోలపై చర్యలు తీసుకోకుండా చిరుద్యోగులపై కొరడా ఘుళిపించటం తగదని హితవు పలికారు. పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి గంగాధర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మంత్రి అవినీతిపై స్పందించి... వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
హోరాహోరీగా ప్రచారాలు
39వ డివిజన్ భాజపా ఎన్నికల కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి నిరీష్తో కలిసి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ బాబు ప్రారంభించారు. 45వ డివిజన్లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి బొమ్ము గోవింద లక్ష్మి సితార సెంటర్ పరిసరాల్లో ప్రచారం నిర్వహించారు. 57 డివిజన్లో తేదేపా కార్పొరేటర్ అభ్యర్థి గంగాధరతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని నాని గొల్లపాలెం గట్టు పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు.
మేయర్ పదవి ఎవరికి దక్కేనో..?
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మహిళా కార్పొరేటర్ అభ్యర్థులు ప్రచారలో దూసుకుపోతున్నారు. మేయర్ పదవి మహిళకు రిజర్వ్ కావటంతో తెదేపా, వైకాపా మహిళా అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. 10, 11వ డివిజన్ తెదేపా అభ్యర్థులు దేవినేని అపర్ణ, కేశినేని శ్వేతలు తమతమ డివిజన్ పరిధిలో ఇళ్లకు వెళ్లి ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటే తెలుగుదేశం గెలుపుతోనే సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. 10వ డివిజన్ వైకాపా అభ్యర్థి వాసిరెడ్డి అనురాధ ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థులంతా... డివిజన్ మార్పు గందరగోళంలో నిమగ్నమయ్యారు. ఈ వ్యవహారం మరో రెండు-మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్న అభ్యర్థులు ఆ తర్వాత ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని యోచిస్తున్నారు.
ఇదీ చదవండి: