అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలని సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. అమరావతి ఉద్యమం 550 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నాడిచ్చిన హామీలను గుర్తు చేస్తూ సీఎంకు ఆదివారం ఆయన లేఖ రాశారు. అధికారం మారినా అమరావతి మారదని 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట మార్చడం పెద్దరికం అనిపించుకోదని హితవు పలికారు. 30వేల ఎకరాల భూమి ఉంటే చాలు రాజధాని ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదని ప్రతిపక్ష నాయకుడి హోదాలో చెప్పి.. ఇప్పుడు 3 రాజధానుల సిద్ధాంతాన్ని తెరమీదికి తేవడం ఏమాత్రం వివేకం అనిపించుకోదని పేర్కొన్నారు. అప్పుల మీద ఆధారపడి రోజులు నెట్టుకొస్తున్న రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణమే కష్టమైనప్పుడు 3 రాజధానులెలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. అందువల్ల ఉన్న భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి వివేకవంతమైన నాయకుడిగా నిరూపించుకోవాలని సీఎంను కోరారు. ‘నేను మాట తప్పను.. మడమ తిప్పనని మీరు పదేపదే చెబుతుంటారు. మీ స్థాయిలో ఉన్న వ్యక్తి పరిస్థితిని సరైన కోణంలో అర్థం చేసుకొని, పాలిస్తున్న రాష్ట్రం మంచికి వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలన్న ఆకాంక్షతో మీరు చెప్పిన మాటలను మీకు గుర్తు చేయడానికే ఈ లేఖ రాయాలనిపించింది.
మీ మాటలు మారుమోగుతున్నాయి..
చిన్న రాష్ట్రమైన ఏపీలో ప్రాంతీయ, ఉప ప్రాంతీయ విభేదాలు సృష్టించకూడదన్న ఉద్దేశంతో అమరావతి రాజధాని ప్రతిపాదనకు గట్టిగా మద్దతు పలుకుతూ మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ మా చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆరోజు మీరు రాజధాని ఎంపిక నిర్ణయాధికారాన్ని అప్పటి ప్రభుత్వానికే వదిలేస్తున్నట్లు చెబుతూనే అందుకు కనీసం 30వేల ఎకరాల భూమి ఉండాలని అసెంబ్లీలోనే మాట్లాడారు. పైగా మీరు అమరావతి ప్రాంతంలోనే 2 ఎకరాల్లో భారీ నివాస, కార్యాలయ సముదాయం నిర్మించుకుని మీ నిబద్ధతను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతోపాటు, ఎన్నికల్లో పోటీ చేసిన సీనియరు నేతలకు ఇదే అంశాన్ని ఉద్బోధించి ఆ పేరుతోనే 2019 ఎన్నికల్లో ఓట్లు అడిగారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాతా అమరావతే రాజధానిగా కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమేకాక అది పెద్దరికం అనిపించుకోదు. సుమారు రూ.56వేల కోట్ల వ్యయంతో తలపెట్టిన కలల నగరాన్ని భవిష్యత్తులేని ప్రాంతంగా చేయడం బాధాకరం.
మూడుతో అయిపోదు..
కేవలం మూడు రాజధానులు ఏర్పాటు చేసినంత మాత్రాన వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి సాధ్యం కాదు. నిజంగా ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే నిధులు, విధుల వికేంద్రీకరణ చేసి, మూడో అంచె ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలి. గత ప్రభుత్వం అమరావతి హరిత నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. దాని ఆధారంగా ఎన్నో దేశ, విదేశీ సంస్థలు, వ్యక్తులు అందులో భాగస్వాములై మాస్టర్‌ప్లాన్‌కు తగ్గట్టు కాంట్రాక్టు పనులు చేశారు. అన్ని పనులూ సాగిన తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దుచేసి దురదృష్టకర పరిణామాలను సృష్టించారు. ఎంతో ఆశతో డబ్బు పెట్టిన పెట్టుబడిదారులు, భూమి ఇచ్చిన రైతులు ఇప్పుడు ప్రధాన బాధితులుగా మారిపోయారు. కర్నూలులో హైకోర్టు, వైజాగ్‌లో రాజధాని పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు న్యాయం కోసం, పనుల కోసం 600-900 కి.మీ. తిరగాల్సి వస్తుంది. ఈ శ్రమ ప్రభుత్వ అధికారులకూ తప్పదు. జీడీపీ, తలసరి ఆదాయపరంగా విశాఖపట్నం ఇప్పటికే దేశంలో పదో, దక్షిణాదిలో నాలుగో సంపన్న నగరం. అలాంటి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలనుకోవడంలో ఉన్న ఆర్థిక తర్కమేంటో అర్థం కావడం లేదు. మీ నుంచి ఏకరూప విధానం కొరవడటంతో మన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ ప్రజా తీర్పును అగౌరవపరుస్తూ, కోర్టు ధిక్కార ధోరణిలో ప్రకటనలు చేస్తున్నారు. అమరావతి ఉద్యమంలో ఇప్పటికే 150 మందికిపైగా రైతులు ప్రాణాలు వదిలారు. భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఊపందుకునే అవకాశముంది’ అని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: