MP Kanakamedala On AP Financial Status: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలిందని రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందన్నారు. నూతన పీఆర్సీలో జీతాలు తగ్గించడంతో.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కుప్పకూలే స్థితిలో ఉందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. పాలన, శాంతిభద్రతలు, ఆర్థిక వ్యవస్థను కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే రోజూ రుణం తీసుకునే పరిస్థితి ఉంది. ఈ రెండున్నరేళ్లలో వివిధ రకాలుగా మూడున్నర లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అందుకు తగిన ఆధారాలు, లెక్కలు కూడా లేవు. రాష్ట్రంలో రుణాలు తీసుకోవడానికే కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లకు ఉపయోగించాల్సిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్‌ను హామీగా చేర్చుతూ రుణం తీసుకున్నారు. రాష్ట్ర పరిస్థితి పూర్తిగా నాశనమైంది. ఉద్యోగస్థులకు సరైన సమయంలో జీతాలు, పింఛన్‌లు ఇవ్వలేని పరిస్థితి. ఫలితంగా ఉద్యోగస్థులకు నూతన పీఆర్సీలో తక్కువ జీతాలు ఇచ్చారు. అందుకు నిరసిస్తూ ఉద్యోగులు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. చిన్న ఇళ్లలో నివసిస్తున్న పేదల వద్ద ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం రూ.10 వేలు వసూలు చేస్తోంది. భవిష్యత్తులో 25 సంవత్సరాల వరకు మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని చూపిస్తూ రుణం తీసుకున్నారు" - కనకమేడల రవీంద్ర కుమార్, రాజ్యసభ ఎంపీ
ఇదీ చదవండి
AP Employees Steering Committee: 'సమ్మెలోకి వెళ్తే.. జీతాలు మిగుల్చుకుందామని ప్రభుత్వం కుట్ర'