GVL suggested new name to YSRCP: ఒక ఎన్నికలోనే వెలిగే పార్టీ వైకాపా అని, దానికి ఇక రాష్ట్రంలో భవిష్యత్తు లేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. డబ్బాపార్టీ, డొక్కు ఫ్యాన్ పార్టీని చూసి ప్రజలు భయపడుతున్నారన్నారు. రాష్ట్ర రాజకీయాలపై భాజపా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిందని, 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదిగి వైకాపాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అరాచక, అవినీతి పాలనను మరింతగా ఎండగడతామన్నారు. విజయవాడలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. చులకనగా మాట్లాడాలని చూస్తే ఖబడ్దార్... భాజపా అల్లాటప్పా పార్టీ కాదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే రెట్టింపు సమాధానం చెబుతాం. మేమూ అలాగే వ్యవహరిస్తే ఎక్కడ దాక్కోవాలో కూడా వైకాపా నేతలకు అర్థం కాదు’ అని మండిపడ్డారు.
దిల్లీ వెళ్లి అప్పు గురించి తప్ప మరో మాట మాట్లాడరా?: ‘ముఖ్యమంత్రి, మంత్రులు దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేది అప్పుల కోసం కాదా? ఇంకేమైనా రహస్య ఎజెండా ఉందా? ప్రధానిని కలిసినా... కేంద్రమంత్రులను కలిసినా అప్పుల గురించి తప్ప మరేమీ అడగరా? ఇష్టానుసారం మాట్లాడితే మా వాళ్లకు హిందీ, ఇంగ్లిషు తప్ప వేరే ఏ భాషా అర్థం కాదని అనుకుంటున్నారేమో? వైకాపా నేతలు మాట్లాడిన ప్రతి వ్యాఖ్యను అనువదించి భాజపా అధిష్ఠానానికి పంపుతాం. దానికి తగ్గట్లు అక్కడి నుంచి రియాక్షన్ వచ్చేలా చేస్తాం. అప్పుల విషయంలో పోల్చుకోవాల్సింది కేంద్రంతో కాదు... పక్కనున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చి ప్రజలకు సమాధానం చెప్పాలి. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ రాష్ట్రప్రభుత్వం తప్పులు చేయట్లేదా? దీనికి ఆర్థికమంత్రి బుగ్గన సమాధానం చెప్పాలి’ అని జీవీఎల్ డిమాండు చేశారు. ‘విశాఖపట్నం, కోనసీమ జిల్లాలకు వెళ్తే భాజపా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో తిరగకూడదా? అమలాపురం అల్లర్లు వైకాపా సృష్టేనని మీ మంత్రే ప్రకటించారు కదా?’ అని జీవీఎల్ అన్నారు.
ఇవీ చూడండి