Minister Peddireddy on power Holiday: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. ఇప్పటి వరకూ పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 186 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉందని తెలిపారు. పరిశ్రమలు వినియోగించాల్సిన విద్యుత్‌ను కూడా 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఆహారశుద్ధి, కోల్డ్ స్టోరేజి, ఆక్వా పరిశ్రమలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతినిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాల కోసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. చాలా రాష్ట్రాల్లో ఇంకా విద్యుత్ కొరత ఉందని పేర్కొన్నారు.
రైతుల్లో బాధ్యత, జవాబుదారీతనం పెంచేందుకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగిస్తున్నామని విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మీటర్ల బిగింపువల్ల ప్రభుత్వానికి లాభం తప్పితే ఎవరికీ నష్టం లేదని పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన 18 లక్షల బోర్లకు 6 నెలల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తామని పునరుద్ఘాటించారు. మీటర్లు బిగించడంవల్ల కొంపలు మునుగుతాయంటూ ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో 28వేల మీటర్లు పెడితే అక్కడ ప్రభుత్వమిచ్చే రాయితీలో 33.15% అంటే మూడో వంతు మిగిలింది. విద్యుత్తు నష్టాలు, చౌర్యాన్ని అధికారులు పట్టించుకోనందునే ఇతర జిల్లాల్లో అధిక విద్యుత్తు వినియోగమై ఉండవచ్చు. వీటిని మార్చడానికే మీటర్లు బిగిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.10వేల కోట్లు విద్యుత్తు రాయితీ ఇస్తున్నాం. మీటర్లు బిగిస్తే రూ.3వేల కోట్లు ప్రభుత్వానికి మిగులుతుందని అంచనా. ఇప్పటివరకు ఎక్కడైనా లీకేజీ, విద్యుత్తు చౌర్యమున్నా రైతులపై తోసేసి ప్రభుత్వంతో ఎక్కువ రాయితీ కట్టిస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి బయటపడనున్నాం’ అని వెల్లడించారు. పక్కనున్న తమిళనాడు, తెలంగాణ, కేరళలు కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయని.. వారి వద్ద ఇదే సమస్య ఉండాలి కదా? అన్న విలేకరుల ప్రశ్నకు.. ‘అక్కడా ఉంటుంది. ప్రాక్టికల్‌గా చూసి చెబుతున్నాం. అయినా మాది జాతీయ పార్టీ కాదు. మా నాయకుడు ఏపీకే సీఎం. రాష్ట్ర వ్యవహారాలకే జవాబుదారీగా ఉంటాం. అన్ని రాష్ట్రాలను పోల్చడానికి నేనేమీ కేటీఆర్‌ను కాదు’ అని బదులిచ్చారు.
ఇవీ చదవండి :