Minister Peddireddy on Power Cuts: రాష్ట్రంలో విద్యుత్ కోతలు వచ్చే నెల మొదటి వారం వరకు కొనసాగే అవకాశాలున్నాయని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మే మొదటి వారం కల్లా విద్యుత్ కొరతను అధిగమించగలుగుతామన్నారు. బొగ్గు లభ్యత పెంచడం, విద్యుత్ కొరతను అధిగమించడం తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఒక కోర్ మేనేజ్మెంట్ టీంను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన మంత్రి.. పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్దరించాలనే లక్ష్యంతో విద్యుత్ సంస్థలు అహర్నిశలూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు కొరత కారణంగా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలు తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని వివరించారు.
నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంటులో 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో కేవలం 2 నుంచి 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయన్నారు. ఫలితంగా అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ విద్యుత్ సరఫరాపై ఆంక్షలు విధించామన్నారు. కొవిడ్ పరిస్థితులు, భారీ వర్షాలు, బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. రష్యా-యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ ప్రభావం అంతర్జాతీయంగా కూడా బొగ్గు కొరతపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. బొగ్గు ధరలు గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరుకున్నాయని, బొగ్గు దిగుమతి చాలా కష్టసాధ్యంగా మారిందని వివరించారు.
అన్ని రాష్ట్రాలూ బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతుండటంతో.. విద్యుత్ ఎక్స్చేజీలలో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా యూనిట్ ధర భారీగా రూ.12 నుంచి రూ.20 రూపాయలకు పలికిందన్నారు. విద్యుత్ కొరత తాత్కాలికమేననీ.. మే నెల మొదటి వారానికల్లా అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గృహ, వ్యవసాయ వినియోగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ కొరత కారణంగా ఒక ఎకరం పంట కూడా దెబ్బ తినకూడదని సూచించారు.
ఇదీ చదవండి : "బాబు బ్యానర్లో.. పవన్ హీరోగా దత్తపుత్రుడు సినిమా.. ఫ్లాప్ ఖాయం"