Minister Botsa: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సీపీఎస్ ఆందోళనలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సీపీఎస్ అంశంపై ప్రభుత్వం ఓ కమిటీ వేసినట్లు తెలిపారు. అధ్యయనం తర్వాత జరిగే కమిటీ భేటీలో సీపీఎస్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్నీ పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఈలోగా ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి వెళ్లడం భావ్యమా? అని బొత్స ప్రశ్నించారు.
విజయవాడ-గుంటూరు రహదారిలో భారీగా పోలీసులు: సీపీఎస్ రద్దు చేయాలంటూ.. యూటీఎఫ్ తలపెట్టిన సీఎంవో ముట్టడి నేపథ్యంలో.. ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తనిఖీల పేరుతో ప్రయాణికులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేస్తుండటంతో.. సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
యూటీఎఫ్ ఆందోళన నేపథ్యంలో సామాన్య ప్రజలకు.. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. తనిఖీల పేరుతో ప్రజలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వివిధ పనుల్లో భాగంగా బయటకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. గుర్తింపు కార్డు చూపాలని ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. జంక్షన్ కూడలి నుంచి విజయవాడ వైపు వెళ్లే అన్ని వాహనాలను పోలీసులు మళ్లింపు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Chirala-Perala: మహోజ్వల ఘట్టంగా "చీరాల-పేరాల" ఉద్యమం