గోదావరి పుష్కరాల ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయినా చంద్రబాబు సీబీఐతో విచారణ చేయించారా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. దేవాలయాల్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలకు తెదేపా పిలుపునివ్వడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. అధికారంలో లేకపోతే మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని బొత్స మండిపడ్డారు. రాష్ట్రంలో చిన్న ఘటనపై కూడా తమ ప్రభుత్వం స్పందిస్తోందని,.. అందుకే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిందని తెలిపారు. చంద్రబాబు వెనక ఉన్న వ్యక్తి ఎప్పుడైనా మాట్లాడారా? ఫామ్‌హౌస్‌లోనే నిరసన తెలుపుతున్నారని ఆరోపించారు.
మరో జాతీయ పార్టీ ఇపుడు ధర్నాలు చేస్తోందని... గతంలో వీరు ఎందుకు స్పందించలేదో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. మతాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దన్న ఆయన.. రాజకీయ పార్టీగా నిరసన తెలియజేయొచ్చు కానీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని బొత్స స్పష్టం చేశారు.
మూడు రాజధానులపై ప్రభుత్వం చట్టం చేసింది... అలాగే ముందుకు వెళతాం. కోర్టుల్లో సాంకేతిక అంశాలపై విచారణ జరుగుతోంది. అది ముగిశాక ముందుకు వెళతాం. ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండి.. పార్టీకి ఏం సంబంధం. అదేమైనా రెఫరెండం అవుతుందా? రాజధాని భూముల విషయంలో తప్పు చేసినవారిని ఎవరినీ ఉపేక్షించేది లేదు. మంత్రివర్గ ఉపసంఘంలో చంద్రబాబును, లోకేశ్‌ను పెట్టుకోవాలా ?
-బొత్స సత్యనారాయణ, మంత్రి