అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్‌లోకి వస్తున్న డ్రగ్స్‌ను దిల్లీ, నొయిడాల్లోని గోదాముల్లోకి చేర్చి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారని డీఆర్‌ఐ దర్యాప్తులో గుర్తించారు. దిల్లీలోని ఓ గోదాములో 16.1 కిలోల హెరాయిన్, 10.2 కిలోల కొకైన్‌ను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నొయిడాలోని ఓ ఇంట్లో 11 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో నల్లధనం లావాదేవీలు ముడిపడి ఉన్నందున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. అఫ్గానిస్థాన్‌లో తాజాగా తాలిబాన్ల తిరుగుబాటు పరిణామాల దరిమిలా ఉగ్ర ముఠాల పాత్రపై శోధించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ జరుపుతోంది.
అఫ్గానిస్థాన్, ఇరాన్‌లోని ముఠాల నుంచి ఎప్పటికప్పుడు సందేశాలు
గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడ్డ కేసులో నిందితుడైన మాచవరం సుధాకర్‌కు అఫ్గానిస్థాన్, ఇరాన్‌లోని ముఠాల నుంచి ఎప్పటికప్పుడు సందేశాలు అందేవని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) గుర్తించింది. అతని భార్య దుర్గాపూర్ణ వైశాలి పేరిట విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్ కంపెనీకి తీసుకున్న ఎగుమతి, దిగుమతుల కోడ్ (ఐఈసీ) లైసెన్సును మాదకద్రవ్యాల మాఫియాకు ఇచ్చినందుకు ఒక్కో కన్‌సైన్‌మెంట్‌పై రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు కమీషన్ అందేదని నిర్ధారించింది. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ కోర్టు ఈ దంపతులిద్దరినీ పది రోజుల పాటు డీఆర్‌ఐ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. అక్కడ రెండు రోజులపాటు విచారించిన డీఆర్‌ఐ.. బుధవారం చెన్నైకి తరలించింది.
సుధాకర్ ఏం చెప్పాడో?
ఈ కేసులో సుధాకర్ దంపతులతో పాటు ఎనిమిది మందిని డీఆర్‌ఐ అరెస్టు చేసింది. వీరిలో మరో భారతీయుడు, నలుగురు అఫ్గాన్ పౌరులు, ఉజ్బెకిస్థాన్ దేశీయుడొకరు ఉన్నారు. రెండు రోజుల కస్టడీలో సుధాకర్ దంపతులను విచారించిన డీఆర్‌ఐ.. వారిచ్చిన సమాచారం మేరకు దిల్లీ, నొయిడా, చెన్నై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, మాండ్వీ, గాంధీధామ్, విజయవాడల్లో సోదాలు చేసింది. లభించిన ఆధారాలు, నిందితుల వాంగ్మూలాన్ని బట్టి డ్రగ్స్ ముఠా మూలాలు ఛేదించేందుకు ప్రయత్నిస్తోంది. సుధాకర్‌కు కమీషన్ రూపంలో డబ్బులు ఎలా వచ్చేవి? ఈ దందాతో ఎలా పరిచయమైంది? కొరియర్ ఏజెంట్ నేపథ్యమేంటన్నది ఆరా తీసింది. చెన్నైలోని సుధాకర్ ఇల్లు, కార్యాలయంతో పాటు ఇతర చోట్ల సోదాలు చేసి నిర్ధారించుకోనుంది. గుజరాత్‌లోని డీఆర్‌ఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్పేశ్ గోస్వామిని ‘ఈనాడు’ ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా.. సుధాకర్, వైశాలి దంపతుల్ని తదుపరి దర్యాప్తు కోసం చెన్నైకి తీసుకెళ్లామని వెల్లడించారు.
అనుబంధకథనాలు