Megastar Chiranjeevi on movie tickets issue: ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు విజయవాడ వచ్చిన ఆయన.. గంటన్నరపాటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ పెద్దగా కాకుండా పరిశ్రమ బిడ్డగా వచ్చానని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ అంశాలపై మరోమారు సమావేశం జరిగే అవకాశముందని చిరంజీవి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం, పది రోజుల్లో సినిమా టికెట్ల ధరపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు. సినిమా టికెట్ల ధరలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరాలోచిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. సీఎంతో సమావేశం ఫలప్రదంగా, సంతృప్తికరంగా సాగిందని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్న చిరంజీవి రోడ్డు మార్గంలో నేరుగా సీఎం నివాసానికి వెళ్లారు. సుమారు గంటన్నరపాటు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. సీఎంతో కలిసి భోజనం చేశారు. సినిమా టికెట్ల విషయమై చర్చించారు. తిరుగు ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
పరిశ్రమ సాధకబాధకాలన్నీ వివరించా
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకే విజయవాడకు వచ్చినట్లు చిరంజీవి చెప్పారు. ‘కొన్ని నెలలుగా సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో మీమాంస, తర్జనభర్జనలు, అగమ్యగోచరమైన పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఒకవైపు.. పరిశ్రమకు మేలు చేద్దామనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం మరోవైపు. ఈ సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ నన్ను ఆహ్వానించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రెండో కోణంలోనూ వినాలని చెప్పారు. ఆయన నాపై పెట్టిన నమ్మకం ఎంతో బాధ్యతగా అనిపించింది’ అని చెప్పారు. ‘సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ ఉద్దేశం, సీఎం ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. చిత్రపరిశ్రమ, థియేటర్లు, ఎగ్జిబిటర్ల సాధకబాధకాల గురించి ఆయనకు వివరించాను. ఈ పరిశ్రమ వెనుక ఎంతో మంది కార్మికులున్నారని, కరోనా కాలంలో పని లేక వారు చాలా అవస్థలు పడ్డారని, నిత్యావసర సరకులు అందించి ఆదుకున్నామని చెప్పాను. థియేటర్లు మూసివేయాల్సి వస్తుందని యజమానులు ఆందోళనలో ఉన్నారనీ సీఎం దృష్టికి తీసుకెళ్లాను. తాను ఒక పక్షాన్నే ఉండననీ, అందరినీ సమదృష్టితో చూస్తాననీ ఆయన చెప్పారు. ఎవరూ ఆందోళన చెందక్కర్లేదని భరోసా ఇచ్చారు. ఆ మాటలతో నాకు ధైర్యం వచ్చింది. త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయానికి వస్తామని.. కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయాలు నా ద్వారా చిత్ర పరిశ్రమకు తెలియజేయమన్నారు’ అని చిరంజీవి వివరించారు.
మాట జారొద్దు
పరిశ్రమ వ్యక్తులు ఎవరూ మాట తూలవద్దని చిరంజీవి సూచించారు. ‘ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. త్వరలో నిర్ణయం రానుంది. ఆమోదయోగ్యమైన జీవో వస్తుందనే నమ్మకం ఉంది. అంతవరకు ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయిదో ఆట ప్రదర్శన గురించి సీఎంకు వివరించాను. దీనిపై కూడా ఆలోచన చేశారు. ఈ చర్చలు చాలా ఫలప్రదంగా జరగడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రితో చర్చల సారాంశాన్ని సినీ పరిశ్రమలోని పెద్దలకు, అన్ని విభాగాల వారికి వివరిస్తాను. వారు ఇచ్చే సూచనలు ఏవైనా ఉంటే మరోసారి సీఎంను కలిసి వివరిస్తా’ అని చెప్పారు.
పరిశ్రమ బిడ్డగానే వచ్చా
‘నేను సినీ పెద్దగా కాదు. బిడ్డగా వచ్చాను. సీఎం నన్ను ఒక్కణ్నే రమ్మని ఆహ్వానించారు. ఆయన పదిమందితో రమ్మంటే పది మందితో, వంద మందితో రమ్మంటే వంద మందితో వచ్చేవాడిని. నేను సినీ పెద్దను అనుకోవడం లేదు. ఇది నా సొంత నిర్ణయం కాదు. ఈ వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆతిథ్యం బాగుంది
అంతకుముందు గన్నవరం విమానాశ్రయం నుంచి చిరంజీవి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీఎం ఎదురొచ్చి చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవి జగన్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించారు. ‘సీఎం ఆతిథ్యం బాగుంది. ఆయన శ్రీమతి దగ్గరుండి వడ్డించారు. వంటలు చాలా చక్కగా ఉన్నాయి. భోజనం చేస్తూ చర్చించుకున్నాం. నామమాత్రంగా కాకుండా చాలా లోతుగా చర్చించాం. ఈ సమావేశం చాలా సంతృప్తినిచ్చింది. సీఎం నాకు సోదరుడిలాంటి వారు. ఎప్పుడైనా భోజనానికి రావచ్చని ఆహ్వానించారు’ అని చిరంజీవి చెప్పారు.
ఇదీ చదవండి: Chiranjeevi meets CM YS Jagan: సినిమా టికెట్ల ధరలు పెంచాలని సీఎంను కోరా: మెగాస్టార్ చిరంజీవి