సాంకేతిక రంగంతో పాటు అన్నింటిలో మహిళలు సత్తా చాటుతున్నారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అన్నారు. నిత్యం నేర్చుకునే గుణంతో పాటు పరివర్తన చెందేందుకు సిద్ధంగా ఉంటే జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదని చెప్పారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల నాయకత్వ అభివృద్ధి ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పరిమితులు, విమర్శలు, అనుకోని ఆటంకాలు సహజమని.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లినప్పుడే విజయం వరిస్తుందని పేర్కొన్నారు.
21వ శతాబ్దంలో మహిళలు కేవలం సాంకేతిక రంగాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ మైలురాళ్లను అందుకున్నారని కొనియాడారు. సీఎఫ్‌ఓ, సీఓఓ, సీఈఓ వంటి ఉన్నత స్థానాల్లో పురుషుల కంటే నాలుగున్నర శాతం మహిళలే అధికంగా ఉన్నారన్నారు. తాను ఫైనాన్స్ రంగంలోకి అడుగుపెట్టిన తొలిరోజుల్లో ఎన్నో సవాళ్లు అధిగమించాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. కుటుంబం, వ్యాపారం.. ఇలా రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ వెళ్లాలంటే పిల్లలు, కుటుంబసభ్యుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. పనిపట్ల అంకితభావం ఉంటే మానసిక ఒత్తిడిని అధిగమించేలా చేస్తుందన్నారు. ప్రతి రోజూ కనీసం ఒక గంట సమయం వ్యాయామం కోసం కేటాయిస్తూ సరైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.
ఇదీ చదవండి: