పబ్లిసిటీతో పేదవాడి కడుపు నిండదనే విషయం ముఖ్యమంత్రి జగన్ గుర్తించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హితవు పలికారు. అనంతపురం జిల్లాలో ఆసరా అందక ఉరవకొండలో వైకాపా నేత విశ్వేశ్వరరెడ్డిని మహిళలు నిలదీసిన ఘటన వైకాపా అసమర్థ ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు.
పెనుకొండలో పరిగి చెరువుకు నీళ్లు రావడం లేదంటూ మంత్రి శంకరనారాయణని రైతులు అడ్డుకొని నిలదీశారని నారా లోకేశ్ అన్నారు. ప్రజలు నిలదీస్తారన్న భయంతోనే జగన్ తాడేపల్లి ఇల్లు దాటి బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. కోవిడియట్స్ అని జాతీయ మీడియా ఉతికారేసినా వైకాపా నాయకులకు బుద్ధి రాలేదని లోకేశ్ మండిపడ్డారు. కరోనా పెద్ద విషయం కాదు.. లైట్ తీసుకోండని స్వయంగా జగన్ సెలవిచ్చాకా వైకాపా ఎమ్మెల్యేలు తగ్గేది లేదంటూ డ్యాన్సులతో కరోనాకి ఆహ్వానం పలుకుతున్నారని ధ్వజమెత్తారు.