అధికారంలోకి వచ్చిన ప్రతి ఒకరూ... రాజ్యాంగ సంస్థ కాలాన్ని కుదించేస్తాను, సంస్థను మూసేస్తాను, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని తీసేస్తాను అంటే ఇక రాజ్యాంగ పదవులు ఎందుకు? రాజ్యాంగ సంస్థలు ఎందుకు?’ అని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌నారాయణ ప్రశ్నించారు. పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పదవీకాలం కుదించడం అంటే ఆయన్ను పదవిలో నుంచి తొలగించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని తెలిపారు. ఇది న్యాయస్థానాల్లో చెల్లదని చెప్పారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదన్నారు. లేకపోతే రాజ్యాంగ సంస్థల ఉనికికే అర్థం లేదని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తొలగింపు అంశంపై ఆయన '‘ఈటీవీ భారత్‌తో' మాట్లాడారు.
ఒకసారి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించిన తర్వాత తీసేసే అధికారం లేదని రాజ్యాంగంలోని 243 (కె) ప్రకారం స్పష్టంగా చెబుతోందని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆర్టికల్ 124 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను ఎలా తొలగిస్తారో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారినీ అలాగే తొలగించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం... 'మేం ఆయనను తీసెయ్యలేదని, పదవీకాలం తగ్గించామ'ని అంటోందని.... ఒకసారి ఎన్నికల ప్రధానాధికారిగా పదవిలో నియమించిన తర్వాత ఆయన పదవీకాలం మొదట ఎంతవరకు నిర్దేశించారో అంతకాలం వర్తిస్తుందన్నారు. అలా కాకుండా పదవీకాలం తగ్గించామనే వంకతో చేసినా అది పదవి నుంచి తొలగించినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రధానాధికారిని నియమించడానికి ముందే పదవీకాలం మూడేళ్లు మాత్రమే ఉంటుందని ప్రకటించి చట్టం చేసి అమలు చేస్తే ఏ ఇబ్బంది లేదన్నారు. అందుకు రాష్ట్ర శాసనసభకు అధికారం ఉందని చెప్పారు. ఆ అధికారాన్ని గౌరవించాలి తెలిపారు.
ఒక్కసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన తర్వాత వాటి పదవీకాలాన్ని కుదించే అధికారం లేదని స్పష్టం చేశారు. ఏదైనా తప్పు చేస్తే విచారణ చేసి తొలగించే అధికారమే ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఆ పంచాయతీకి ఎన్నికలు నిర్వహిస్తే మిగిలిన పదవీకాలమే వర్తిస్తుంది తప్ప అయిదేళ్లు వర్తించదని తెలిపారు. రాజ్యాంగం చేతులు కట్టేసి... నేను రాజును నా ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే మంచిదికాదని వ్యాఖ్యానించారు.