స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85శాతం రిజర్వేషన్లు కల్పించడంపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ప్రమాణపత్రంలో వివరాలు సమర్పించారు. అధికరణ 243డి(6) ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల విషయంలో నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందన్నారు. 1995లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. బీసీ జనాభాతో పోలిస్తే వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లు తక్కువన్నారు. 34శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్లు సుప్రీంకోర్టు పేర్కొన్న దానికి అనుగుణంగా ఉన్నాయన్నారు . ప్రత్యేక పరిస్థితుల్లో 50శాతం రిజర్వేషన్లు మించొచ్చని సుప్రీం పేర్కొందని తెలిపారు. ప్రమాణపత్రంలో పేర్కొన్న వివరాల ఆధారంగా పిల్‌ను కొట్టివేయాలని కోరారు.
ఇదీ చదవండి: వార్షికోత్సవాల పేరుతో పాఠశాలల్లో సొమ్ము వసూళ్లపై హైకోర్టులో పిటిషన్