తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఒక కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం రాష్ట్రాన్ని కలచివేసింది. కన్నీరు పెట్టించింది. కాసిపేట మండలం మల్కపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు రమేశ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. 30 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగుచేస్తే పెట్టుబడి కూడా రాక, అప్పులు తీర్చలేక ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం కౌలురైతుల కష్టాలను చాటిచెప్పింది.
అప్పు తీర్చలేక.. నోటీసుకు భయపడి..
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కనకయ్య (38)కు 20 గుంటల భూమి మాత్రమే ఉంది. జగదేవపూర్‌కు చెందిన వ్యవసాయదారుడి దగ్గర నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట సాగుకు యజమాని దగ్గరే రూ.లక్షన్నర అప్పు చేశాడు. ఈ అప్పు తీర్చలేకపోవడంతో కనకయ్యకు భూ యజమాని లీగల్ నోటీసు పంపించారు. చదువురాని కనకయ్య ఆ లీగల్ నోటీస్‌ను చూసి జైలుకు పోతానేమో అని భయపడి గత నెల 20న చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. కనకయ్యకు భార్య అనిత, ముగ్గురు పిల్లలున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు సాగుచేస్తున్న కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వపరంగా ఏ శాఖ కూడా వీరికి సాయం చేయకపోవడం, రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపివేయడం, బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో వీరి సేద్యానికి చేయూతే లేకుండా పోయింది. కౌలు రైతులను అధికారికంగా గుర్తించకూడదని ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ శాఖలు వీరి గోడు వినడం మానేశాయి. గతంలో వ్యవసాయశాఖ పంటలబీమా ఇతర పథకాలకు కౌలు రైతులను అధికారికంగా గుర్తించేది. ఇప్పుడు పూర్తిగా మానేసింది.
కౌలురైతులకు బ్యాంకుల నుంచి పంట‘రుణ అర్హత కార్డు’లను (ఎల్‌ఈసీ) గతంలో రెవెన్యూశాఖ ఇచ్చేది. మూడేళ్లుగా పూర్తిగా ఆపేసింది. ఈ కార్డు చూపితే బ్యాంకులు పంటరుణం ఇచ్చేవి. ఇప్పుడు పంటరుణాలివ్వడం మానేశాయి. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని రైతు సంఘాల అంచనా. వీరిలో మొత్తానికే సొంత భూమి లేకుండా కౌలుకు తీసుకునేవారు, కొద్దోగొప్పో భూమి ఉండి మరి కొన్ని ఎకరాలను కౌలుకు తీసుకునే వారూ ఉన్నారు. ఈ అందరికీ చేయూత కరవైంది. భూమి లేని కౌలు రైతులకు పంటల సాగుకు సాయపడాలని, వారి ‘సంయుక్త భాగస్వామ్య సంఘాలు’ (జేఎల్‌జీ)గా ఏర్పాటుచేసి పంటరుణాలివ్వాలని రిజర్వుబ్యాంకు, నాబార్డు సిఫార్సుచేశాయి.
గుర్తించడం మానేయడంతో..
కానీ తెలంగాణలో కౌలు రైతులను వ్యవసాయ, రెవెన్యూశాఖలు గుర్తించడం మానేయడంతో జేఎల్‌జీల ఏర్పాటు, వాటికి పంటరుణాలివ్వడం తగ్గిపోయిందని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు. భూమి లేని కౌలురైతులు 5 నుంచి 10 మంది జేఎల్‌జీగా ఏర్పాటుకాగానే వారికి ప్రోత్సాహకంగా రూ.4 వేలను నాబార్డు ఇస్తుంది. వీరికి ఉమ్మడి పూచీకత్తు మీద పంటరుణాలిస్తే కేవలం ఒక్కో రైతు పావలావడ్డీకే రూ.లక్షా 60 వేల దాకా పంట రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ జేఎల్‌జీల ఏర్పాటే లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి రూ.3 నుంచి 5ల వడ్డీకి అప్పులు తీసుకుని పంటలసాగుకు పెట్టుబడులు పెట్టి కౌలు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు.
భూమిపై రుణాలుండటంతో..
కౌలు రైతుకు రుణం ఇవ్వాలంటే అతను ఏ భూమిని కౌలుకు తీసుకున్నాడనే సర్వేనంబరు వివరాలతో ఒప్పంద పత్రాన్ని భూమి యజమాని ఇవ్వాలి. కానీ ఏ భూ యజమానీ ఈ పత్రాలు రాసి ఇవ్వడం లేదు. పైగా కౌలుకు ఇచ్చిన భూముల్లో తామే పంటలు సాగుచేస్తున్నట్లు పంటరుణాలు తీసుకుంటున్నారు. దీనివల్ల అదే భూమికి మళ్లీ కౌలురైతులకు పంటరుణం ఇవ్వడానికి బ్యాంకు మేనేజర్లు అంగీకరించడంలేదు. దీంతో ప్రైవేటు రుణాలే దిక్కవుతున్నాయి.
గత జులై నుంచి అక్టోబరు వరకూ కురిసిన అధిక వర్షాలకు పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి కనీసం 4 క్వింటాళ్ల పత్తి కూడా రాని రైతులెందరో ఉన్నారు. పత్తి సాగుచేయాలంటే ఎకరానికి రూ.10 వేల నుంచి 15 వేల దాకా కౌలు కట్టాలి.సాగు ఖర్చులు కనీసం మరో రూ.25 వేలు అవుతాయి. అంటే ఎకరానికి రూ.35 వేల పెట్టుబడి పెడితే 4 క్వింటాళ్ల పత్తిపై రూ.20 వేలకు మించి రాని పరిస్థితి. ఎకరానికి రూ.10 వేల నుంచి 15 వేల దాకా నష్టం వచ్చిన కౌలు రైతులు అనేకమంది ఉన్నట్లు ఒక అధికారి వివరించారు.
అన్నింటికీ అనర్హులే..
రాష్ట్రంలో పంటలసాగుకు వ్యవసాయ, ఉద్యానశాఖలు పలు పథకాల కింద నేరుగా రాయితీలు, ప్రోత్సాహకాలిస్తున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ కౌలురైతులకు ఇవ్వడం లేదు. కౌలు రైతులు అన్ని పథకాలకు అనర్హులేనని వ్యవసాయ, ఉద్యానశాఖలు తెలిపాయి. ఉదాహరణకు కొత్త బడ్జెట్‌లో రూ.1500 కోట్లను వ్యవసాయ యంత్రాలపై రాయితీకి కేటాయించింది. వీటిలో ఒక్క రూపాయి కూడా కౌలురైతులకు రాదు. ఈ ఏడాది రూ.14,600 కోట్లను రైతుబంధు కింద భూ యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఈ సొమ్మునూ కౌలు రైతులకు భూ యజమానులు ఇవ్వడం లేదు.
పంటరుణాలివ్వాలని చెపుతున్నాం
ప్రతి కౌలు రైతుకు ఏదో ఒక రూపంలో పంటరుణం ఇవ్వాలని బ్యాంకులకు ఎప్పటికప్పుడు చెపుతున్నాం. దేశంలో పంట సాగుచేసే ప్రతి రైతుకు 4 శాతం వడ్డీకే పంటరుణం ఇవ్వాలని రిజర్వుబ్యాంకు, నాబార్డు అన్ని బ్యాంకులకు చెబుతున్నాయి.కానీ ఇటీవల కౌలు రైతులకు పెద్దగా రుణాలివ్వడం లేదనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది. - యడ్ల కృష్ణారావు, రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్, నాబార్డు
ఆత్మహత్య చేసుకునేవారిలో 80 శాతం మంది కౌలురైతులే
గత ఆరేళ్లలో 5600 మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నట్లు నేర రికార్డుల ద్వారా వెల్లడైంది. వీరిలో 80 శాతం మందికి పైగా కౌలు రైతులే ఉన్నట్లు రైతు స్వరాజ్య వేదిక అధ్యయనంలో తేలింది. ఆత్మహత్య చేసుకున్న 700 మంది రైతుల కుటుంబాలను మేం స్వయంగా వివరాలు అడిగితే ప్రభుత్వపరంగా ఏ సాయం అందలేదని చెప్పారు. భూమి యజమాని కౌలుకు ఇచ్చినప్పుడు వారికి రైతుబంధు ఇవ్వకుండా ఆపివేస్తే దాదాపు రూ.4 వేల కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయి. అంటే ప్రభుత్వం అదనంగా ఖర్చులేకుండా వాటిని కౌలు రైతులకు ఇచ్చి ఆదుకోవచ్చు. -బి.కొండల్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు, రైతుస్వరాజ్యవేదిక
ఇవీ చూడండి: