అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విటర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాతృభాష నేర్చుకోవటం పుట్టుకతో అమ్మ నుంచి సంక్రమించిన హక్కుగా ఆయన అభివర్ణించారు. ఆ హక్కును ఏ ప్రభుత్వాలూ కాలరాయకూడదని హితవు పలికారు. ఏ మాధ్యమంలో చదువుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛ.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంపై వైకాపా ప్రభుత్వం బోగస్ సర్వేలు, నకిలీ కమిటీలతో తమ పంతం నెరవేర్చుకోవాలని చూడటం బాధాకరమన్నారు.
'ఆంగ్ల మాధ్యమాన్ని మెుదటగా మేమే ప్రవేశపెట్టాం'
ఆంగ్ల మాధ్యమానికి తమ పార్టీ వ్యతిరేకమని చిత్రీకరించటం దారుణమన్నారు. ఆంగ్లభాషను ప్రభుత్వ పాఠశాలల్లో మెుదటగా తమ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. 40 శాతం పాఠశాలల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేసినట్లు తెలిపారు. కానీ... ఆంగ్లభాషలోనే చదవాలని నిర్భందం చేయలేదన్నారు. తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించటానికి తమ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: