ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పాటు..రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కృష్ణా జిల్లా కలెక్టర్ సూచించారు. గుంటూరులో వర్షాలు, వరదలపై జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
- పులిచింతల ప్రాజెక్టుకు మరింత పెరిగిన వరద
ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో పులిచింతలకు 6.65 లక్షల క్యూసెక్కుల ప్రవాహం పెరిగింది. 19 గేట్ల ద్వారా 5.99 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనకు మరో 10వేల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారు. జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 44.94 టీఎంసీలు కాగా...మెుత్తం సామర్ధ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం నీటిమట్టం 174.47 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులుగా ఉంది.
- అప్రమత్తంగా ఉండాలని కృష్ణా కలెక్టర్ సూచన
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలో వరద ఉద్ధృతి పెరిగింది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సూచించారు. నదిలో స్నానాలకు వెళ్లరాదని, పశువులను మేతకు తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. నదిలో బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో ప్రయాణించవద్దన్నారు.
- గుంటూరు జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు
గుంటూరు జిల్లాలో వర్షాలు, వరదలపై జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. జిల్లాలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
- కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ సెంటర్ ఫోన్ నంబర్ : 0863 –2324014
- గుంటూరు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ నంబరు : 0863 –2240679
- తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్‌రూమ్ నంబరు: 08644 – 223800
- గురజాల ఆర్డీవో కార్యాలయం కంట్రోల్‌రూమ్: 77028 53860, 81061 42574
ఇదీ చదవండి:
అలర్ట్ : రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు