రాష్ట్ర రాజకీయాలకు వేదిక విజయవాడ. అలాంటి కీలక నగరానికి మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కేశినేని శ్వేతను ప్రకటించింది. అప్పటినుంచి శ్వేత పేరు మారుమోగుతోంది. అసలు ఎవరీ శ్వేత, నేపథ్యం ఏమిటి అనే చర్చ జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని కుమార్తె అని అందరికీ తెలుసు. కానీ 24 ఏళ్ల శ్వేత గురించి చాలామందికి తెలియని ఎన్నో విషయాలున్నాయి.
విద్యాభ్యాసం:
కేశినేని శ్వేత విజయవాడలోని అట్కిన్‌సన్, వి.పి.సిద్ధార్థ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. బెంగళూరులో ఇంటర్ చదివారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరి విశ్వవిద్యాలయంలో బీఏ సైకాలజీ, బీఏ ఎకనమిక్స్ పూర్తి చేశారు.
విదేశాల్లో ఉద్యోగాలు:
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆఫ్రికాలోని ఘనా దేశంలో మైక్రో ఫైనాన్స్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్‌లో శ్వేత కొంతకాలం పనిచేశారు. ఐర్లాండ్‌లోని గాల్వే నగరంలో చైల్డ్ సైకాలజీ ప్రోగ్రామ్‌లో కొనసాగారు.
టాటా ట్రస్టులో:
టాటా ట్రస్టు తరఫున మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి శ్వేత కృషి చేశారు. ఆ తర్వాత టాటా ట్రస్టు క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్, అసోం, ఒడిశా, రాజస్థాన్‌లో పని చేశారు.
రాజకీయాలు:
అట్లాంటా సెనేటర్ ఎన్నికలకు 2014లో కేశినేని శ్వేత ప్రచార బాధ్యతలు చేపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరఫున 2016లో ప్రచారం చేశారు. రాష్ట్రంలో జరిగిన 2014, 2019 ఎన్నికల్లో తన తండ్రి తరఫున ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలోనే అందరికీ దగ్గరయ్యారు.
సేవా కార్యక్రమాలు:
ఎంపీ కుమార్తెగానే కాకుండా... శ్వేత తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటుకున్నారు. శ్వేత విజయవాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ కాలంలో.. పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పలు కాలనీల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.. మాస్కులు పంచారు. నగరంలో తిరుగుతూ... ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రశ్నించే గొంతుక:
శ్వేత సహజ స్వభావం ప్రశ్నించడం. తనముందు అన్యాయం జరిగితే నిలదీసే తత్వం శ్వేతది. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని... శ్వేత ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. కరోనా కాలంలో పేదల ఖాతాల్లో డబ్బులు వేయాలని డిమాండ్ చేశారు. తెదేపా నేతలపై కక్ష సాధింపు చర్యల పట్ల శ్వేత తీవ్రంగా స్పందించేవారు. తెదేపా నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ.. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌కు కలిసి వివరించారు. ఇలా ఎప్పటికప్పడు శ్వేత ప్రశ్నించే గొంతుకై నిలిచారు.
విజయవాడ నగరాన్ని అభివృధ్ధి చేసి, అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెబుతున్న కేశినేని శ్వేత.. రాష్ట్ర రాజకీయ నగరంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఇదీ చదవండీ... 'నన్ను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నారు'