విశాఖ రాజధాని అవుతోందంటే ఉత్తరాంధ్ర వాసులు భయంతో వణికిపోతున్నారని... అందుకు వైకాపా విధానాలే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణను రాజధాని రైతులు కలిశారు. అమరావతి పోరాటం, భాజపా మద్దతుపై చర్చించారు. రాజధాని రైతులకు భాజపా అండగా ఉంటుందని కన్నా హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి అమరావతిలో దోచుకున్నారని... ఇప్పుడు ఇక్కడ దోచుకునేందుకు ఏమీ లేదనే జగన్ విశాఖలో రాజధాని పెడుతున్నారని ఆరోపించారు.
వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే.. ఆర్టీసి, విద్యుత్, పెట్రో ఛార్జీలు, మద్యం ధరలు పెంచి ప్రజల రక్తం పిండుతోందని విమర్శించారు. అభివృద్ది, సంక్షేమం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీల మాదిరిగానే తెదేపా, వైకాపా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. అవినీతి తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ఆలోచన లేదన్నారు. రాజధాని ఇక్కడే ఉంచాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని కన్నా హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'భూదందా కోసమే రాజధానిని మార్చే ప్రయత్నం'