దసరా శరన్నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ముగిశాయి. దసరా పర్వదినాన అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. కొండపై పూర్ణాహుతి ముగిసిన తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. శివాలయం, మహామండపం మీదుగా అర్జున వీధిలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించుకుంటూ దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. ఊరేగింపు కేరళ వాయిద్యాలతో ..భక్తుల ఆట పాటలతో వైభవంగా జరిగింది.
దుర్గాఘాట్‌లో హంస వాహనంలో ఉత్సవ విగ్రహాలను ఉంచారు. విగ్రహాలకు పూజ కార్యక్రమం నిర్వహించారు. పూజలో విజయవాడ పోలీసు కమిషనర్ బి. శ్రీనివాసులు, కలెక్టర్ ఇంతియాజ్, దుర్గగుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేశ్ బాబు పాల్గొన్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్క్ ధరించి, శానిటైజర్‌ను వినియోగించారు. అధికారులు, ప్రముఖులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్సవ విగ్రహాలకు పూజ అనంతరం తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే కరోనా కారణంగా విగ్రహాలకు హంస వాహనంలో పూజ జరిపిన అధికారులు.. కృష్ణానదిలో జల విహారాన్ని ఈ ఏడాది నిలువరించారు. పూజ అనంతరం కృష్ణానదికి హారతులు ఇచ్చారు. కృష్ణా నది హారతులు భక్తులను ఆకట్టుకున్నాయి. నాట్యకళాకారులు సంప్రదాయ నృత్యాలతో భక్తులను ఆకట్టుకున్నారు. దసరా పండుగ విశిష్టతను వివరిస్తూ చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.
కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు చేశారని...కృష్ణానది హారతులు బాగున్నాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఉత్సవ విగ్రహాలను సంప్రదాయం ప్రకారం ఊరేగింపుగా వన్ టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: దసరా సంబురాలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు