తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా నియమితులు కాగా.. తెలంగాణ హైకోర్టు సీజేగా కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ నియమితులయ్యారు. ప్రస్తుత ఏపీ సీజే జస్టిస్ ఎ.కె.గోస్వామి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయ్యారు. గత నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం పలువురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు ఐదుగురు సీజేలను బదిలీ చేయాలని కేంద్రానికి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం సిఫార్సులకు ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్రవేశారు.
జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు...
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గడ్‌లో జన్మించారు. బిలాస్‌పుర్‌లోని గురు ఘసీదాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబర్ 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయగడ్ జిల్లా కోర్టుతోపాటు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గడ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గానూ పనిచేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యునిగా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఛత్తీస్‌గడ్ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్‌గా పదోన్నతి పొందారు. 2009 డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయన.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
బంగారు పతకాల విద్యార్థే.. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి బి.ఎన్.శర్మ భోపాల్‌లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, తల్లి శాంతి శర్మ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రాథమిక విద్య జబల్‌పూర్‌లోని సెంట్రల్ స్కూల్‌లో పూర్తి చేశారు. 1981లో సాగర్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. మూడు సబ్జెక్ట్‌ల్లో డిస్టింక్షన్ సాధించి నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొందారు. అందులోనూ మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1993లో అడిషినల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2004లో సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా పదోన్నతి పొందారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏళ్లకే ఈ హోదా పొందిన వ్యక్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై ఉన్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు ప్రచురించారు. కర్ణాటక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఇదీ చదవండి
Pawan kalyan: కులాల గురించి మాట్లాడుతున్నది రెచ్చగొట్టేందుకు కాదు: పవన్