గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ షరతులను సడలించాలంటూ వేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితునిగా ఉన్న గాలి జనార్థన్ రెడ్డి.. బళ్లారికి వెళ్లకూడదనే షరతులతో 2015లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులు సడలించాలంటూ జనార్థన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ.. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాస్ వాదనలు వినిపించారు.
కుటుంబ సభ్యులు బళ్లారిలో ఉంటున్నారని.. 2015 నుంచి ఇప్పటివరకు బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని రోహత్గీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. బళ్లారి వెళ్లేందుకు షరతులను సడలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాలి జనార్థన్ రెడ్డి చాలా శక్తిమంతుడని.. బళ్లారి వెళ్లటానికి అవకాశమిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరఫు న్యాయవాది మాధవి దివాస్ ధర్మాసనానికి తెలిపారు. బెయిల్ షరతులను సడలించవద్దని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చదవండి: