పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలపైనా, అధికారులపైనా, న్యాయవ్యవస్థపైనా ఉందని జస్టిస్ గోపాల గౌడ చెప్పారు. అయితే పర్యావరణానికి ముప్పు వాటిల్లినప్పుడు ప్రజలు సైతం స్పందించే హక్కును రాజ్యాంగం ప్రతీ ఒక్కరికీ కల్పించిందని పేర్కొన్నారు. ‘'రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన బాధ్యతలు, ప్రకృతి వనరులను పరిరక్షించాల్సిన పౌరుల బాధ్యత'’ అనే అంశంపై జనసేన పార్టీ నిర్వహించిన వెబ్‌నార్ చర్చా కార్యక్రమంలో జస్టిస్ గోపాల గౌడ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
వాతావరణ కాలుష్యం కారణంగా జరుగుతున్న అనర్థాలను చర్చించి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందని... ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ పరిరక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించాయని అన్నారు. ప్రకృతిని పరిరక్షించడంలో ఇంకా ఎన్నో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జస్టిస్ గోపాల గౌడ అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు ప్రధాన కారణం- పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేయడమేనని గోపాల గౌడ అన్నారు. అందువల్లే ఈ పెనుప్రమాదం చోటు చేసుకుందని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ సంఘటనలోని బాధితులకు పరిహారం అందించాలని ఇందుకోసం రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మెహతా వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు విశాఖ దుర్ఘటనకు వర్తిస్తుందని తెలిపారు.