ఆలయాలు పునర్నిర్మిస్తామన్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి.. తన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచినా ఒక్క ఆలయాన్నీ పునర్నిర్మించలేదని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో విస్తరణ పనుల్లో భాగంగా కూలగొట్టిన ఆలయాలను పునర్నిర్మించాలని ఆందోళనలు చేసిన శివస్వామి వైకాపా సభ్యత్వం తీసుకున్నారన్న అనుమానం వస్తుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితులు మంత్రి వెల్లంపల్లికి కాసుల పంట పండించిందని విమర్శించారు. వైకాపా నాయకులకు కరోనా పాజిటివ్ అని తేలినా.. క్వారంటైన్‌కు పంపకుండా మంత్రి అడ్డుకున్నారని ఆరోపించారు.
మంత్రి నిర్లక్ష్యం వల్లే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరిగాయని మహేశ్ ఆరోపించారు. అధికారులు ఒత్తిళ్లకు లొంగకుండా నడుచుకోవాలన్న ఆయన... కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్పందించి వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 210 కరోనా పాజిటివ్ కేసులు