Jada Sravan Kumar Party : రాష్ట్రంలో ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై విజయవాడలో శనివారం ‘దళిత అసెంబ్లీ’ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చకు జై భీమ్ యాక్సెస్ జస్టిస్ (జేఏజే) వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజున రాజకీయ పార్టీ ప్రకటన చేస్తామని, 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ దళిత బహుజనుల చేత పోటీ చేయిస్తామని శ్రావణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, వాటిని నిరోధించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో నిందితులకు స్టేషన్ బెయిలు ఇవ్వడంపై తాను సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్టు వెల్లడించారు. దళితుల సమస్యలపై చర్చించేందుకు ప్రతి నెలా ‘దళిత అసెంబ్లీ’ నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెదేపా నేతలు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ... దళితుల ఓట్లతో గెలిచిన జగన్ ఆ వర్గాలన్నింటినీ నట్టేట ముంచారని విమర్శించారు. దళిత హక్కుల సంఘం వ్యవస్థాపకుడు, ఏపీ జర్నలిస్టు ఫోరం నాయకుడు చెవుల కృష్ణాంజనేయులు, కాంగ్రెస్ నేత కె.వినయ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు మేళం భాగ్యరావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వరరావు, మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, భాజపా నాయకులు విజయవర్ధన్, జాన్‌పాల్, జేఏజే నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :