రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణ, ధ్రువీకరణ పత్రాలను డిజిటలైజేషన్ చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని సూచిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది నుంచి అన్ని విశ్వవిద్యాలయాలు ఏపీసీఎఫ్ఎస్ఎస్ రూపొందించిన ఎగ్జామ్ మేనేజ్మెంట్ పోర్టల్ మాత్రమే అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని విద్యా సంస్థల్లోనూ పరీక్షల నిర్వహణ, మార్కుల షీట్లు, ఉత్తీర్ణత ధ్రువపత్రాలను డిజిటల్లోనే జారీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. కాగితంపై ముద్రించి విద్యార్ధులకు పంపిణీ చేసే వాటిపై వ్యయం చేయటాన్ని ఇప్పటికే నిషేధం విధించినట్టు వెల్లడించింది.
పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల జారీ, మార్కుల షీట్లు ఇతర అంశాలు వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి పూర్తి సహకారాన్ని ఏపీసీఎఫ్ఎస్ఎస్ సంస్థ విశ్వవిద్యాలయాలకు అందిస్తుందన్నారు. నిర్దేశిత ఫార్మాట్లో విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సైతం నేషనల్ అకాడెమిక్ డిపాజిటరీలోనూ అప్లోడ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. 2021 విద్యా సంవత్సరంలో 2,3,4 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ నూతన విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది.
నూతన విధానాన్ని అనుసరించేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని విశ్వవిద్యాలయాల వైస్ఛాన్స్లర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఉన్నత విద్యా మండలితో పాటు ఉన్నత విద్యాశాఖలు సంయుక్తంగా ఈ డిజిటల్ ఎగ్జామినేషన్ పోర్టల్‌ను అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.
ఇదీ చదవండి:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఫలితం మిగిలింది