గతేడాది నవంబరులో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ఇవాళ పెట్టుబడి రాయితీ విడుదల చేయనుంది. మొత్తం 5,97,311 మంది రైతులకు రూ. 542.06 కోట్లతో పాటు వైఎస్సార్ యంత్ర సేవా పథకం రాయితీ కింద రూ.29.51 కోట్లను సీఎం జగన్ విడుదల చేయనున్నారని వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. పంటనష్టంతోపాటు ఇసుక మేటలతో నష్టపోయిన వారికి ఎకరానికి రూ.4,939 చొప్పున, నేల కోతకు గురైతే రూ.15,182 చొప్పున పరిహారం అందిస్తున్నామని వివరించారు.
అధిక వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 10.10 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. పెట్టుబడి రాయితీ కింద వ్యవసాయ పంటలకు రూ.482.27 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.59.55 కోట్లు, పట్టు శాఖ పరిధిలో రూ.23.26 లక్షల మేర విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ఇప్పటి వరకు 2,641 కేంద్రాలకు రూ.35.55 కోట్ల రాయితీ ఇచ్చామని.. మూడో విడతగా 1,220 కేంద్రాలకు రూ.29.51 కోట్లు విడుదల చేస్తున్నామని కమిషనర్ వివరించారు.
ఇదీ చదవండి