తెలుగురాష్ట్రాల ఆర్టీసీల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల.... పలు రద్దీ రూట్లలో బస్సుల సంఖ్య భారీగా తగ్గనుంది. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసుల సంఖ్యపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటిదాకా తిప్పుతున్న కిలోమీటర్లను తగ్గించి ఒప్పందం చేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం.. తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ.. 2లక్షల 65వేల కిలోమీటర్ల మేర 1009 బస్సులు నడపుతుండగా.. మన రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ లక్షా 52వేల కిలోమీటర్ల మేర 746 సర్వీసులు తిప్పుతోంది. ఇరు ఆర్టీసీలకు వచ్చే ఆదాయంలో తేడాలున్నప్పటికీ... రద్దీ సమయాల్లోనూ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మెండుగా బస్సులు ఉండేవి. గతంలో ఇరు రాష్ట్రాలు కలిసి నడిపే 4లక్షల 17వేల కిలోమీటర్లను సమానంగా పంచుకునుంటే బస్సుల సంఖ్య తగ్గేది కాదని.. ఎవరో ఒకరికైనా లబ్ధి చేకూరేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తాజా ఒప్పందం ప్రకారం..... 2 రాష్ట్రాలూ కలిపి కేవలం 3లక్షల 22వేల కిలోమీటర్ల మేరే బస్సులు నడపనున్నాయి. లక్షా 4వేల కిలోమీటర్ల మేర తగ్గిన ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు.. భారీ నష్టాన్ని తీసుకురానున్నాయి. ఈ ఒప్పందంలో తెలంగాణ... మరో 8వేల 914 కిలోమీటర్లు మాత్రమే పెంచింది. దీంతో ఆ రాష్ట్రానికీ పెద్దగా లాభం ఉండకపోగా.. ప్రైవేట్‌కు లబ్ధి చేకూరే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. తాజా ఒప్పందం వల్ల.. 2 రాష్ట్రాల్లో 95వేల 454 కిలోమీటర్లలో 291 బస్సులను తిప్పలేని పరిస్థితి నెలకొంది.
సాధారణంగా... హైదరాబాద్ నుంచి ఎక్కువగా డిమాండ్ ఉండే.... విజయవాడ, కర్నూలు రూట్లలో.... ఇరు రాష్ట్రాల కలుపుకుని లక్షా 37వేల కిలోమీటర్ల మేర సర్వీసులు నడిచేవి. ఇప్పుడు చెరో 52వేలు కిలోమీటర్లు మాత్రమే నడవనున్నాయి. కేవలం ఈ రూట్లలోనే... తెలంగాణ భూ భాగంలో లక్షా 3వేల కిలోమీటర్లు నడిచే ఏపీఎస్ఆర్టీసీ సర్వీసుల సంఖ్య.. దాదాపు సగానికి పడిపోయింది. ఇదే రూట్‌లో తెలంగాణ సర్వీసుల సంఖ్య 111 పెరిగాయి. కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు నడిపే రూట్లలో.. ఏపీఎస్ఆర్టీసీ 20వేల కిలోమీటర్ల మేర నష్టపోగా.. తెలంగాణ కేవలం 3వేల కిలోమీటర్లు పెంచింది. ఇవే కాక... పిడుగురాళ్ల, గుంటూరు, వాడపల్లి, మాచర్ల, భద్రాచలం, ఖమ్మం మార్గాల్లోనూ ప్రస్తుతం 2 రాష్ట్రాల బస్సులు రాకపోకలు జరుపుతున్నాయి. సమాన కిలోమీటర్ల ప్రాతిపదికన.... ఈ మార్గాల్లోనూ ఏపీ సర్వీసుల సంఖ్య తగ్గిపోనున్నాయి. బస్సులు తిప్పేటప్పుడు.... ఇరు రాష్ట్రాల సరిహద్దుల దూరంలో వ్యత్యాసం వల్లే ఏపీఎస్ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.