ప్రభుత్వం అందించే సేవలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్వాతంత్య్ర వేడుకల్లో ఆయా శాఖలు శకటాలను ప్రదర్శించాయి. మొత్తం 16 శకటాలను ప్రదర్శించగా ‘దిశ’కు ప్రథమ బహుమతి దక్కింది. రెండోస్థానంలో విద్యాశాఖ నాడు-నేడు శకటం, మూడోస్థానంలో వ్యవసాయశాఖ శకటం నిలిచాయి. ప్రదర్శనలో ముందుగా మహిళా పోలీసులు ద్విచక్ర వాహనాలపై వెళుతుండగా వారి వెనుక దిశ శకటం కదిలింది. ఆ తర్వాత మిగిలిన శకటాలు వరుసగా కవాతులో పాల్గొన్నాయి. శకటాలు ఎక్కువగా వైకాపా రంగుల్ని పోలి ఉండటం విమర్శలకు తావిచ్చింది. వేడుకల్లో సాయుధ దళాల కవాతు జాతీయత ఉట్టిపడేలా సాగింది. కర్నూలులోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్, కాకినాడలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్, విజయనగరంలోని ఐదో ఏపీఎస్పీ బెటాలియన్, కడప జిల్లా భాకరాపేటలోని 11వ ఏపీఎస్పీ బెటాలియన్, విశాఖపట్నంలోని 16వ ఏపీఎస్పీ బెటాలియన్, ఏపీ సైనిక్ వెల్ఫేర్ కంటింజెంట్, ఏపీఎస్పీ బ్రాస్ బ్యాండ్, ఏపీఎస్పీ పైప్‌బ్యాండ్, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల స్కాట్‌లాండ్ పైప్‌లైన్ బ్యాండ్ కంటింజెంట్ కవాతులో అలరించాయి.
అవార్డుల ప్రదానం
ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన శకటాలకు, కవాతులో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి సీఎం జగన్ అవార్డులను ప్రదానం చేశారు. సాయుధ బలగాల్లో ప్రథమ బహుమతిని కర్నూలులోని రెండో ఏపీఎస్పీ బెటాలియన్, ద్వితీయ బహుమతిని 5వ ఏపీఎస్పీ బెటాలియన్ గెలుపొందాయి. ఏపీ సైనిక్ వెల్ఫేర్ కంటిజెంట్‌కు ప్రత్యేక కేటగిరీలో అవార్డు అందించారు.
కన్సొలేషన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల స్కాట్‌లాండ్ ఫైర్‌బ్యాండ్ కంటింజెంట్‌కు బహుమతి అందించారు. కవాతులో మంచి ప్రదర్శన చేసిన కంటింజెంట్లకు డీజీపీ గౌతమ్ సవాంగ్ నగదు ప్రోత్సాహకాలు అందించారు. వేడుకల్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, సీఎం సతీమణి వై.ఎస్.భారతి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: