- Telangana Illegal Constructions: హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉండి మూడున్నరేళ్ల క్రితం పురపాలక సంఘంగా మారిన దుండిగల్ పరిధిలో 2004 నాటి అనుమతులతో నిర్మాణాల వ్యవహారం వెలుగు చూసింది. పట్టణంలో విలీనమైన గాగిల్లాపూర్‌లో 18 ఏళ్ల నాటి అనుమతులతో విల్లాల నిర్మాణం జరుగుతున్నట్లు గుర్తించారు. పంచాయతీ అనుమతులతో కోట్ల రూపాయల విల్లాల నిర్మాణం చేపడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
- కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామాల్లో పంచాయతీ అనుమతులతో భారీ సంఖ్యలో నిర్మాణాలు ఇప్పటికీ జరుగుతున్నట్లు వెల్లడైంది. నగరానికి కిలోమీటరు దూరంలోని విలీన గ్రామంలో కార్పొరేషన్ అధికారులు సర్వే చేస్తే వందకుపైగా అక్రమ నిర్మాణాల వ్యవహారం బయటపడింది. దీంతో ముందుకు ఎలా వెళ్లాలో తెలియక అధికారుల గందరగోళంలో పడ్డారు. వీటికి అనుమతులు ఎలా వస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
Corporation Permission For Building Construction: పురపాలకశాఖ పర్యవేక్షణ లోపం, సిబ్బంది కొరత అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది. పట్టణాలుగా మారిన, నగరాల్లో అంతర్భాగమైన గ్రామాల్లో, పంచాయతీ అనుమతులతోనే భవనాలు వెలుస్తున్నాయి. 2018 ఆగస్టులో పలు గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చారు.. మరికొన్నిటిని నగరపాలక సంస్థల్లో విలీనం చేశారు.
వేలాది నిర్మాణాలు..
Municipal Permission For Building Construction: ఇది జరిగి మూడున్నర ఏళ్లయినా పాత పంచాయతీల అనుమతులతోనే వేలాది నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ విషయంలో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కొందరు బిల్డర్లు ఏళ్లనాడే అనుమతులు పొందినట్లు, పనులు పూర్తికానట్లు చెబుతూ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. సాధారణంగా గ్రామ పంచాయతీలకు గ్రౌండ్ ఫ్లోర్, మరో రెండు అంతస్తుల వరకు మాత్రమే అనుమతి ఇచ్చేందుకు అధికారం ఉంది. ఆపై భవనాల నిర్మాణానికి డీటీసీపీ అనుమతి తప్పనిసరి. విల్లాల నిర్మాణానికి పంచాయతీలు అనుమతి ఇచ్చే అవకాశమే లేదు. కానీ పంచాయతీల అనుమతులతో అనేక అంతస్తులతో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భవన నిర్మాణాలకు పంచాయతీలు ఇచ్చే అనుమతులు రెండేళ్ల వరకు మాత్రమే చెల్లుబాటవుతాయి. కానీ ఎప్పటివో అనుమతులు చూపి భవనాలు కట్టేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇలాంటి ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. టీఎస్ బీపాస్ నిబంధనలు కఠినంగా ఉండడం, మార్గదర్శకాలను పక్కాగా పాటించాల్సి రావడంతో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలకు తెరతీస్తున్నారు.
కుప్పలుతెప్పలుగా అనుమతులు..
Building Permission Rules Telangana :సాధారణంగా గ్రామ పంచాయతీలు ఇచ్చిన భవన నిర్మాణ అనుమతుల వివరాలను పక్కాగా నమోదు చేయాలి. దీంతోపాటు అనుమతులకు వసూలైన మొత్తాన్ని ఖజానాలో జమ చేయాలి. కానీ చాలా గ్రామాల్లో రికార్డులు లేవని, పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారని కారణాలు చూపడంతో సమాచారం బదిలీ కాకుండానే విలీన ప్రక్రియ పూర్తయింది. దీంతో పాత తేదీలతో అప్పటి సర్పంచులు, గ్రామ కార్యదర్శుల సంతకాలతో నిర్మాణ అనుమతులు ఇప్పటికీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ ఉల్లంఘనల కారణంగా కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లు నిబంధనల మేరకే నిర్మించామని చెప్పి అమ్ముతున్నారు. ఇబ్బందులు వచ్చినపుడు మాత్రం చేతులత్తేస్తున్నారు. లక్షల రూపాయలు చెల్లించి వెనక్కిరాలేక.. ముందుకు వెళ్లలేక కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారాల్లో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండడం కూడా అధికారుల ముందరికాళ్లకు బంధంగా మారుతోంది. కొందరు కార్పొరేటర్లు, వార్డు సభ్యుల రియల్ వ్యవహారాల జోలికి వెళ్లాలంటేనే అధికారులు జంకుతున్నారు.
యథేచ్ఛగా ఉల్లంఘనలు..
Building Permission for Construction : తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ అయింది. ఇక్కడ 64 భవన నిర్మాణాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నపుడు అనుమతి పొందినవి ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని బడంగ్‌పేట, బోడుప్పల్ కార్పొరేషన్లలో అక్రమ నిర్మాణాల జోరు నేటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటైన తుర్కయాంజాల్ పురపాలిక పరిధిలో నివాస, వాణిజ్య నిర్మాణాల జోరు కొనసాగుతోంది. ఎక్కడా నిబంధనలు పాటించడంలేదు. నిజాంపేట కార్పొరేషన్, దుండిగల్ సహా నగరం చుట్టుపక్కల పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మణికొండ పురపాలక సంఘంలో పంచాయతీల అనుమతుల పేరుతో భారీ సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి.