రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించే రాజకీయ పార్టీల సమావేశానికి హాజరు కాకూడదని వైకాపా నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటన జారీచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉందో లేదో ప్రభుత్వం అభిప్రాయం తీసుకోకుండా కనీసం సీఎస్, వైద్యశాఖ ఉన్నతాధికారుల సూచనలు తీసుకోకుండా ఈ సమావేశం నిర్వహించడం సరికాదని వైకాపా అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో వైకాపా, పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డతో ముఖాముఖి సమావేశానికి హాజరు కాకూడదని తమ పార్టీ నిర్ణయమని అంబటి ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒక్క ఓటు, సీటు కూడా లేని రాజకీయ పార్టీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించిన ఎస్ఈసీ దురుద్దేశాలు త్వరలోనే బయట పడతాయని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా ప్రభుత్వానికి తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా వాటిని ఎస్ఈసీ బేఖాతరు చేస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారని వైకాపా ఆరోపించింది.
ఇదీచదవండి