సంక్రాంతి పండగ సందడి వచ్చేసింది. స్వగ్రామాలు, పట్టణాలకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ కిటకిటలాడింది. పండగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. శనివారం విశాఖకు 85, రాజమండ్రి 20, అమలాపురం 20, కాకినాడ 25 అదనపు బస్సులు నడిపినట్లు బస్టేషన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం 8వ నంబరు ప్లాట్‌ఫాంపై ‘హెల్ప్ డెస్క్’ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విశాఖపట్నం వైపు వెళ్లే అదనపు బస్సులకు మాత్రమే టికెట్‌పై అదనంగా 50 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే బస్ స్టేషన్ టీఐ ఫోన్ నెంబరు 99592 25467, డిప్యూటీ సీటీఎం ఫోన్ నెంబరు 95151 25823లలో సంప్రదించవచ్చు.
- కీసరలో బారులు తీరిన వాహనాలు
సంక్రాంతి పండగను సొంత గ్రామాల్లో చేసుకునేందుకు హైదరాబాద్, తెలంగాణ జిల్లాల నుంచి పలువురు తమ సొంత, ప్రైవేటు వాహనాల్లో బయలుదేరారు. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు మొదలు పెట్టారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, కంచికచర్ల మండలం కీసర టోల్ వసూలు కేంద్రాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు టోల్ రుసుం వసూలు చేసేందుకు అదనంగా ఒక వరుస ఏర్పాటు చేసినట్లు స్వర్ణ టోల్ ప్లాజా మేనేజర్ జయప్రకాష్ తెలిపారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ కీసర టోల్ ప్లాజా మీదుగా 9 వేల వాహనాలు విజయవాడ వైపు వెళ్లాయని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: