తెలంగాణలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమదేవరపల్లిలో పెద్దఎత్తున బ్లాక్ గన్ పౌడర్ పట్టుబడింది. ఓ ఇంటిపై దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 18 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. ఓ నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.
భీమదేవరపల్లికి చెందిన వల్లె ఐలయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేసేవాడని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. కరోనా వల్ల ఆదాయం సరిపోక.. సులభంగా డబ్బు సంపాదించుకోవాలని పేలుడు పదార్థాలు విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలోని క్రషర్, గ్రానైట్ కర్మాగారాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించామని సీపీ వెల్లడించారు.
ఎలాంటి అనుమతులు లేకుండా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను అతను కొనుగోలు చేశాడని సీపీ తెలిపారు. అతను తన ఇంటి పెరటిలో భద్రపర్చి అవసరమైనప్పుడు గ్రానైట్ పరిశ్రమలకు సరఫరా చేసేవాడని అన్నారు. పక్కా సమాచారం రావడంతో ఇంటిపై దాడులు చేసి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తరుణ్ జోషి వెల్లడించారు. ఇళ్ల మధ్యలో పేలుడు పదార్థాలను భద్రపర్చడం ద్వారా ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన భారీ మొత్తంలో పేలుడు సంభవించేదని సీపీ పేర్కొన్నారు. మరో నిందితుడు పురుషోత్తం పరారీలో ఉన్నాడని తెలిపారు.
పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందం భారీ మొత్తంలో బ్లాక్ గన్ పౌడర్ సీజ్ చేశాం. మొత్తం 36 బ్యాగులు పట్టుకున్నాం. దాదాపు 18 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ పౌడర్ విక్రయిస్తున్న ఐలయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. గతంలో వ్యవసాయం చేసుకుంటున్న ఐలయ్య కరోనా వల్ల ఆదాయం లేక అధిక సంపాదన కోసం గన్ పౌడర్ విక్రయానికి పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేసిన బ్లాక్ గన్ పౌడర్ స్టోన్ క్రషర్స్, గ్రానైట్ పరిశ్రమలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏడాదిన్నరగా ఈ విధంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గన్ పౌడర్ విక్రయించేందుకు అనుమతులు కఠినతరంగా ఉన్నాయి. దీనికి చాలా సమయం పడుతుంది. ఇది ఎక్కువగా బ్లాస్టింగ్‌లో వినియోగిస్తారు. - తరుణ్ జోషి , వరంగల్ పోలీస్ కమిషనర్