కరోనా తీవ్రత నేపథ్యంలో వినాయక చవితి పండగకు ఇళ్లల్లోనే ఉంటూ నిరాడంబరంగా మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గణేశ్ ఉత్సవాలపై సూచనలు కాదని... స్పష్టమైన ఆదేశాలు ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ... ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. రెండు సార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నివేదికలు సమర్పించకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
జనం గుమిగూడకుండా చర్యలేంటి?
వినాయక నిమజ్జనం సందర్భంగా భారీగా జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే కలుషితమైన హుస్సేన్‌సాగర్‌లో రసాయనిక రంగులతో కూడిన విగ్రహాల నిమజ్జనం జరగకుండా ఎలా నిరోధిస్తారో స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
కౌంటర్లు దాఖలు చేయకపోతే... జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఉన్నతాధికారులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: