రాష్ట్ర వ్యాప్త కారాగారాల్లో ఖైదీలుగా ఉంటూ.. 65 ఏళ్ల వయసు పైబడి.. క్యాన్సర్ తదితర తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 102 మందిని మానవతా దృక్పథంతో విడుదల చేసేందుకు సంబంధిత కోర్టుల్లో బెయిలు పిటిషన్లు దాఖలు చేయాలని... జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు హైపవర్ కమిటీ సూచించింది. అలాగే... కోవిడ్ కారణంగా ఖైదీలకు ఈ-ములాఖత్ పైలెట్ ప్రాజెక్ట్ ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని జైళ్ల శాఖకు స్పష్టం చేసింది. ఈనెల సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మధ్యంతర బెయిల్, పెరోల్‌పై విడుదలైన ఖైదీలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సరెండర్ కావాలని కోరవద్దని జైళ్లశాఖాధికారులను ఆదేశించింది.
జైళ్లలో ఆత్మహత్యల నివారణకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొంది. కారాగారాల్లో ఉన్న ఖైదీలకు కరోనా సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని జైళ్లలో కరోనా పరిస్థితులను పర్యవేక్షించేందుకు, అర్హులైన ఖైదీల విడుదల విషయంలో ఏపీ న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్, జైళ్ల శాఖ డీజీ మహమ్మద్ అహ్సన్ రెజాతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ మరోసారి సమావేశం అయింది. ఈ భేటిలో పలు కీలక తీర్మానాలు చేసింది.
181 మంది ఖైదీల విడుదల..
జైళ్ల శాఖ డీజీ ఇచ్చిన నివేదిక ప్రకారం విడుదలకు అర్హులైన 294 మంది ఖైదీల్లో 181 మంది విడుదల అయ్యారని కమిటీ పేర్కొంది. 17 మంది సాధారణ బెయిలుపై, మరో ఇద్దరు రిమాండ్‌లో ఉన్న కాలానికి బదులుగా శిక్షాకాలం పూర్తయినందున విడుదల అయ్యారని, మరో ముగ్గురు శిక్షాకాలం పూర్తి కావడంతో విడుదల అయ్యారని తెలిపింది. ఇంకా 18 మంది విడుదల కావాలని తెలిపింది. మరికొంత మంది పూచీకత్తులు సమర్పించక, కోర్టుల నుంచి బెయిల్ ఉత్తర్వులు అందక విడుదల కాలేదని డీజీ పేర్కొన్నారు. పూచీకత్తులు సమర్పించలేక విడుదల కాలేని వారి విషయంలో షరతులను సడలించాలని, సొంత పూచీకత్తులపై విడుదలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థలు చర్యలు తీసుకోవాలని కమిటీ తీర్మానించింది. బెయిలు ఉత్తర్వులు వేగంగా జైళ్లకు పంపి విడుదల అయ్యేలా చూడాలని సూచించింది. ఆగస్టు 28 మరోసారి కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది.
ఇదీ చదవండి: