గుంటూరు జిల్లా నరసారావుపేటలోని కోర్టు భవనంలో దివ్యాంగులైన న్యాయవాదులు, కక్షిదారులకు మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది జీఎల్వీ రమణమూర్తి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నిమ్మల సత్యనారాయణ వాదనలు వినిపిస్తూ.. మొదటి అంతస్తులో ఉన్న కోర్టులకు వెళ్లేందుకు దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వారికి సౌకర్యవంతగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. నరసారావుపేటలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులైన న్యాయవాదులు, కక్షిదారులకు న్యాయస్థానాల్లో లిఫ్టు, రాకపోకలకు సులువుగా ఉండే ఏర్పాట్లు, సౌకర్యమైన వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వసతుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ, రహదారులు భవనాల శాఖకు చెందిన అధికారులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ఆదేశించింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి
ముగ్గురు భార్యల బంగార్రాజు కేసులో ట్విస్ట్.. రెండో ఆమెనే స్కెచ్ వేసి...