విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయ నిర్మాణ సివిల్ వర్క్స్ అన్నింటిని మే నెలాఖరుకు పూర్తి చేసి భవనాన్ని అప్పగిస్తామని గుత్తేదారు హైకోర్టుకు నివేదించారు. ఫర్నిచర్, ఇతర సౌకర్యాలను సమకూర్చాల్సింది ప్రభుత్వమేనని గుత్తేదారు తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. భవనం పూర్తి స్థాయి వినియోగంలోకి తెచ్చేందుకు పర్నిచర్ , ఇతర సౌకర్యాలను పూర్తి చేసే విషయంలో ఏమి చర్యలు తీసుకున్నారు ? ప్రణాళిక ఏమిటీ తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఇంజనీర్, భవనాల శాఖను ఆదేశించింది. అనంతరం విచారణను మార్చి 22 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
విజయవాడలోని కోర్టు భవన శ్రీపతిరావు హైకోర్టులో సముదాయ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని సవాలు చేస్తూ న్యాయవాది చేకూరి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణలో రహదారులు , భవనాల శాఖ తరుఫు ప్రభుత్వ న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి వాదనలు వినిపించారు. కాంట్రాక్టర్కు బిల్లుల బకాయిలు రూ.5 కోట్లు చెల్లించామన్నారు. 8వ అంతస్తుకు అదనంగా రూ.6 కోట్ల వరకు పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. కాంట్రాక్టర్ తరఫు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ .. మూడు అంతస్తులు స్వాధీనానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని అంతస్తులకు శ్లాబ్ పూర్తి చేశామన్నారు.మే నెలాఖరుకు భవనాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు . ఫర్నిచర్ , తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
ఇదీ చదవండి: ఆ వివాదంలో జోక్యం చేసుకోవడటం సరికాదు: హైకోర్టు