రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో మున్నేరు పొంగిపొర్లుతోంది. నదిలో నీటి ప్రవాహం లక్ష క్యూసెక్కులకు పెరగటంతో కృష్ణాజిల్లాలోని లింగాల, పెనుగంచిప్రోలు వంతెనపై నుంచి ప్రవాహం ఉద్ధృతి కొనసాగుతోంది. వత్సవాయి మండలంలోని లింగాల, ఆలూరుపాడు, పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు-అక్కపాలెం రహదారిలో పడమటి వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో జోరుగా వానలు పడుతున్నాయి. 57 మండల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుళ్లూరులో అత్యధికంగా 30.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి పిడుగురాళ్లలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఎడతెగని జల్లులతో వరి, పత్తి, మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కంది పంట మొలకెత్తని పరిస్థితి ఏర్పడింది.
కృష్ణా జిల్లా నందిగామ మండలం పల్లగిరి కొండ వద్ద...... కూచివాగు వరదలో చిక్కుకున్న రైతులను ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. పల్లగిరి, మాగల్లు గ్రామాల మధ్య మామిడి తోటలో చిక్కుకుపోయిన ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భారీ వర్షాలతో కర్నూలులో రహదారులు జలమయం అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వాన నీరు చేరడంతో చికిత్స కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో అనకాపల్లి శారదా నది.. జలకళ సంతరించుకుంది. అరకులోయ మండలంలో ఉన్న బొండాం కొత్తవలస, ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం, బుంగాపుట్టు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు అవతల ఉన్న 18 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
కృష్ణా నదీ పరివాహక ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీగా నీరు చేరుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లోకి నీరు వస్తోంది.
ఇదీ చదవండి:'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి'