పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని ఉభయ గోదావరి జిల్లాల్లో వివిధ గ్రామాల గిరిజన నిర్వాసితులను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 'శక్తి' స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి. శివరామకృష్ణ పిల్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది కెఎస్ మూర్తి వాదనలు వినిపించారు. పరిహారం చెల్లించకుండా..గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. పునరావాసం కింద ఏర్పాటు చేసిన నివాస ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. గిరిజనులను చెందిన ఇళ్లను బలవంతంగా కూల్చివేస్తున్నారన్నారు. అందుకు సంబంధించిన వివరాల్ని కోర్టు ముందు ఉంచారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ వాదనలు వినిపిస్తూ.. నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయించబోమని హైకోర్టుకు తెలిపారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...ఆ విషయమై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పునరావాసం కల్పించకుండా గిరిజన నిర్వాసితులను గ్రామాల నుంచి ఖాళీ చేయించవద్దని అధికారులకు సూచించాలని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌కు మౌఖికంగా స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అనంతరం విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
ఇదీచదవండి