తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందలాది గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 220 కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. త్వరలో మరో 70 పూర్తి కానున్నాయి. ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. కరీంనగర్ జిల్లాలో 319 గ్రానైట్ క్వారీలు ఉండగా... ప్రస్తుతం 150 నడుస్తున్నాయి.
మళ్లీ పరిశ్రమలకు...
కరోనాతో సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన కార్మికులు... మళ్లీ గ్రానైట్ పరిశ్రమలకు చేరుకుంటున్నారు. జిల్లాలో మ్యాపుల్ రెడ్, ట్యాన్బ్రౌన్, ట్యాన్‌బ్లూ, సర్ఫ్‌గ్రీన్ రకాల గనులు వందలాది హెక్టార్లలో వ్యాపించి ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా లభిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించడానికి ఆసక్తి చూపడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పలు దేశాలకు ఎగుమతి...
గ్రానైట్‌ను ఆంధ్రప్రదేశ్, దిల్లీ ఇలా అనేక రాష్ట్రాలకు, వియత్నాం, రష్యా, దుబాయ్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లాలోని క్వారీలలో లభించే బండ నాణ్యమైనది కావడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి నుంచి బ్లాక్‌లను కాకినాడ ఓడరేవు ద్వారా చైనాతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. లాక్‌డౌన్‌లోనూ లారీలకు పన్నులు, ఇన్సూరెన్స్‌లు కట్టామని యజమానులు వాపోతున్నారు.
20 వేల మందికి ఉపాధి...
గ్రానైట్ క్వారీలు, కటింగ్, పాలిషింగ్ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో యూనిట్‌లో 20 నుంచి 50 మంది అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిశ్రమ గాడిపడుతున్న దృష్ట్యా కరోనా నాటి ఆర్థిక ఇబ్బందులు ఇంకా పరిష్కారం కాలేదని కార్మికులు అంటున్నారు.
ఆదుకోవాలి...
పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని గ్రానైట్ యాజమాన్యం కోరుతోంది. జీఎస్టీ శాతాన్ని 18 నుంచి 12కు తగ్గించాలని విద్యుత్ ఛార్జీలనూ తగ్గిస్తే నష్టాలను అధిగమించే అవకాశం ఉంటుందని కోరుతున్నారు.
ఇదీ చదవండి: దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్ టెన్షన్