Govt Chief Whip Srikanth Reddy Fire On CBN: ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ఏ అంశంపైనైనా సరే బహిరంగ చర్చకు మేం సిద్ధమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రూ.40 వేల కోట్ల ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని.., కావాలంటే వీటి వివరాలు అందిస్తామని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ దిల్లీ పర్యటన విజయవంతమైందని..,దీన్ని తప్పుదోవ పట్టించేందుకే చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి అంతా భ్రమరావతేనని, పది వేల కోట్లు ఖర్చు పెట్టానంటోన్న చంద్రబాబు అమరావతిలో ఎక్కడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని దుయ్యబట్టారు. అమరాతిలో చంద్రబాబు ఉంటోన్న ఇంటికి కనీసం డ్రైనేజీ కూడా నిర్మించలేదని.., డ్రైనేజీ నీటిని కృష్ణానదిలో కలుపుతున్నారని విమర్శించారు.
చంద్రబాబు వల్లే రాష్ట్రం అప్పుల పాలు..
చంద్రబాబు వల్లే రాష్ట్రం అప్పులపాలైందని.. ఆయన చేసిన అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తోందన్నారు. ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1.70 లక్షల కోట్లను ప్రజలకు పంచిందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. సంక్షేమ పథకాల వల్ల పేదలు ఎంత లబ్ధి పొందారో నారావారిపల్లెకే వెళ్లి చూద్దామని అన్నారు. అర్థరాత్రి ప్యాకేజీకి ఒప్పుకుని ప్రత్యేక హోదాను నిర్దాక్షిణ్యంగా చంపేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ధైర్యముంటే వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తానని ప్రకటించాలన్నారు. సామాన్య మానవుడికి సినిమా టికెట్ల ధరలు అందుబాటులో ఉంచటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్పొరేట్ శక్తులతో చేతులు కలిపి ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.
కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఎం దిల్లీ టూర్: చంద్రబాబు
వివేకా హత్య, సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఎం దిల్లీ పర్యటన అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి హామీలు ఏమయ్యాయని నిలదీశారు. వివేకా హత్యకేసులో వెన్నంటే ఉన్నట్లు సోదరిని నమ్మించి అధికారంలోకి రాగానే ఎదురుదాడికి దిగారని ఆరోపించారు. వివేకా కూతురు మీదే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు. ప్రత్యేక హోదా.. విభజన సమస్యలపై ఎంపీలంతా రాజీనామా చేద్దామంటే వైకాపా స్పందించటం లేదని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు అంటే.. తెలియక హామీ ఇచ్చేశామంటున్నారని విమర్శించారు. రూ. 7 లక్షలకు పైగా అప్పు చేసి.. భావితరాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిది ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోవాలనే విపరీత ధోరణి అని అన్నారు. కేంద్ర నిధులకు కొత్త పేర్లు పెట్టి.. ఏదో ఇచ్చేశామని జగన్ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.
ఇదీ చదవండి
Chandrababu On YSRCP Govt: 'వైకాపా పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారు'