ఆర్టీసీలో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఆర్టీసీలోని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లాక్డౌన్తో విపత్కర పరిస్థితులున్న సమయంలో ఉద్యోగాల తొలగింపుతో పొరుగు సేవల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని వారికి న్యాయం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సహా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు రవాణా శాఖ మంత్రి పేర్ని నానికి లేఖలు రాశాయి. ఉద్యోగాల నుంచి తొలగించొద్దంటూ.. రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సీఎం జగన్ కు లేఖ రాసింది. లాక్డౌన్ కాలంలో ఏ ఉద్యోగినీ తొలగించొద్దని కేంద్రం ఆదేశాలిచ్చినా.. యాజమాన్యం పట్టించుకోకుండా తొలగించిందని సీఎం, మంత్రి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించబోమని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
కార్మిక సంఘాలు అభ్యంతరంతో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా స్పందించి ఆర్టీసీ అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రి పేర్నినాని ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరినీ తొలగించడం లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీలోని ఉద్యోగులందరూ యథాతథంగా ఉద్యోగాల్లో కొనసాగుతారని మంత్రి తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగ కల్పనే కానీ ఉద్యోగాల తొలగింపు ఉండదని మంత్రి పేర్ని నాని ప్రకటనలో పేర్కొన్నారు.